మీడియా సంస్థ‌ల‌ను గుప్పిట్లోకి తెచ్చుకునే య‌త్నం

– బ్లాక్ మెయిల్ చేస్తున్న సీఎం
– అర్థ‌రాత్రి అరెస్ట్ చేయ‌డ‌మేంటి?
– నోటీసులిచ్చి ప్ర‌శ్నించ‌వ‌చ్చు క‌దా
– సంబంధం లేని వ్య‌క్తి అరెస్ట్ దారుణం
– ద‌ళిత జ‌ర్న‌లిస్టుపై ఎస్సీ, ఎస్టీ కేసా?
– జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ ను ఖండిస్తున్నాం
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13: జర్నలిస్టుల అరెస్ట్ ద్వారా మీడియా సంస్థలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కానీ రేవంత్ రెడ్డి నాలుగో స్తంభమైన మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీడియా అంటే ఎందుకో కోపమ‌ని ప్ర‌శ్నించారు. జర్నలిస్టులను చూస్తే చెంపలు పగలగొట్టాలనిపిస్తుందని గతంలో ఆయనే అన్నారు. ఆ కసిని ఇప్పుడు బయటపెట్టుకుంటున్నారన్నారు. పండుగ పూట జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి వికృత ఆనందం పొందుతున్నారు. మేము స్వేచ్ఛను ఇస్తున్నాం అని గప్పాలు కొట్టిన రేవంత్ఇ ప్పుడు ఎమర్జెన్సీని తలపించేలా నియంతలా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులేమైనా తీవ్రవాదులా? సంఘ విద్రోహ శక్తులా? లేక బ్యాంకులను లూటీ చేసిన ఆర్థిక ఉగ్రవాదులా? అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు? నోటీసులిచ్చి మర్యాదపూర్వకంగా పిలిచి విచారించవచ్చు కదా? ఘటన జరిగినప్పుడు ఒక జర్నలిస్ట్ లీవ్‌లో ఉండి శబరిమలకు వెళ్లారు. సంబంధం లేని వ్యక్తిని అర్ధరాత్రి ఇంట్లో నుంచి అరెస్ట్ చేయడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం. సుధీర్ అనే దళిత జర్నలిస్ట్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.

గతంలో కేటీఆర్‌పై మీ మంత్రి అడ్డగోలు కామెంట్స్ చేసినప్పుడు బాధపడ్డది కూడా ఒక మహిళే కదా అని స‌జ్జ‌నార్‌కు గుర్తు చేశారు. అప్పుడు మీ పోలీసులు ఏం చేశారు? మీ చట్టం నిద్రపోయిందా? అప్పుడు ఎందుకు విచారణ చేయలేదు? సిట్ ఎందుకు వేయలేదు? మంత్రికి చెందిన కంపెనీ పేదవాళ్ళ భూమిని కబ్జా చేస్తే, వారికి రక్షణ కల్పిస్తారు కానీ అరెస్ట్ చేయరు. నిజాయితీగా పనిచేసిన సీఐని మాత్రం బదిలీ చేస్తారు. నేషనల్ హైవే 44 కాంట్రాక్టర్‌ను కాంగ్రెస్ ఏఐసీసీ నాయకుడు సంపత్ కుమార్ డబ్బుల కోసం బెదిరించారు. దీనిపై 9వ తేదీన ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఆయన్ను అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేయలేదు?  కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడితే కేసులు ఉండవు. సిద్దిపేటలో నాపై కాంగ్రెస్ నాయకులు అనరాని మాటలు అన్నారు. ఫిర్యాదు చేసి ఇన్ని రోజులైనా కేసు నమోదు కాలేదు. రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేశాడని మంత్రి కూతురు మీడియాకు చెప్పింది. దానిపై ఎందుకు సిట్ వేయలేదు? శనివారాలు, అర్ధరాత్రుల్లో రేవంత్ రెడ్డిలోని అరాచకవాది నిద్రలేస్తాడు. శని, ఆదివారాలు చూసి పేదల ఇళ్ళు కూలగొడతారు. హోంశాఖను దగ్గర పెట్టుకుని పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు. ప్రశ్నించిన పాపానికి ప్రతిపక్ష నాయకులను,సోషల్ మీడియా వారియర్స్ ఇంటి మీదికి పోలీసులను పంపి అరెస్టు చేస్తారు. అల్లు అర్జున్ ఇంటి మీద కూడా పోలీసులను పంపి రేవంత్ రెడ్డి హరాస్ చేశాడు. సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి మీది కూడా అర్ధరాత్రి పోలీసులను పంపించాడు. మహిళా జర్నలిస్టులు అని చూడకుండా రాత్రి 12 తర్వాత రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశాడు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే గొంతుల మీద పోలీసులను ఉసిగొల్పుతున్నాడు. జర్నలిస్టులపైన అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటిస్తున్నద‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *