జర్నలిస్టుల అక్రెడిటేషన్ కష్టాలు 

– వెబ్ పోర్టల్ మాడ్యూల్‌పై పాత్రికేయుల ఆగ్రహం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 17 :  రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన అక్రెడిటేషన్ వెబ్ పోర్టల్ జర్నలిస్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగు దశలు (అక్రెడిటేషన్ టైప్, బేసిక్ డిటెయిల్స్, ప్రొఫెషనల్, అక్రెడిటేషన్ డిటెయిల్స్) ఒకదానికొకటి లింక్ అయి ఉండటమే కాకుండా, అనేక కఠినమైన షరతులతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా దశాబ్దాల క్రితం జర్నలిజంలోకి వచ్చిన సీనియర్లను సైతం అప్పాయింట్‌మెంట్ లెటర్లు, విద్యార్హత ధృవీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని జర్నలిస్టులు వాపోతున్నారు. చాలా పత్రికా సంస్థలు అసలు అప్పాయింట్‌మెంట్ లెటర్లే ఇవ్వవని తెలిసి కూడా అధికారులు ఇలాంటి నిబంధనలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు, వెటరన్ జర్నలిస్టులు , ఎడిటర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎడిటర్ స్థాయిలో పనిచేసిన వారు కూడా కరస్పాండెంట్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, గత ఆరు నెలల్లో ప్రముఖ పత్రికల్లో ‘బైలైన్’తో వచ్చిన 20 వార్తా కథనాలను అప్‌లోడ్ చేయాలనే నిబంధన సీనియర్లకు శాపంగా మారింది. వెబ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాల కారణంగా అన్ని వివరాలు నమోదు చేసినా చివరి నిమిషంలో ‘ఎర్రర్’ అని రావడం జర్నలిస్టుల సహనానికి పరీక్షగా మారింది. అసలు అక్రెడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మాడ్యూల్‌ను తయారు చేశారా? లేక జర్నలిస్టులను వడబోయడానికి ఇలాంటి అడ్డంకులు సృష్టించారా? అని పాత్రికేయ లోకం ప్రశ్నిస్తోంది. ఈ జటిలమైన ప్రక్రియపై జర్నలిస్టు సంఘాలు మౌనంగా ఉండటంపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సరళమైన పద్ధతిని విడిచిపెట్టి, డిజిటల్ యుగంలో మరింత క్లిష్టమైన విధానాన్ని తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జిల్లా స్థాయి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే నాథుడే లేరని, ఐ అండ్ పీఆర్ అధికారులు ఫోన్లకు స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రెడిటేషన్ మాడ్యూల్‌ను సరళతరం చేయాలని, లేనిపక్షంలో జర్నలిస్టుల నుంచి తీవ్ర నిరసన తప్పదని జర్నలిస్టు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *