– మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి అంగీకారం
– పునశ్చరణ తరగతుల్లో ఉర్దూ అకాడమి చైర్మన్
హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దన్ తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ హైదరాబాదులో నిర్వహిస్తున్న ఉర్దూ జర్నలిస్టుల పునశ్చరణ తరగతుల ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్ర జర్నలిస్టులకు ముఖ్యంగా ఉర్దూ జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ఉర్దూ జర్నలిస్టుల కోసం ఉర్దూ అకాడమీ ద్వారా సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మాతృ భాషకు తగినంత ప్రేరణ, ఆదరణ ఇవ్వాలన్నారు. యూరప్ ఖండంలోని ఫ్రెంచ్, జర్మనీ, క్యూబా, ఇటలీ దేశాల ప్రజలు ప్రభుత్వం వారి మాతృ భాషలో అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్ర అధికారిక భాషలైన తెలుగు, ఉర్దూలకు మనమంతా ప్రాధాన్యతనిచ్చి అన్ని కార్యకలాపాలు మాతృభాషలోనే చేయాలని సూచించారు. మీడియా అకాడమీ జిల్లాలలోని జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నదని, ఇప్పటివరకు నాగర్‌కర్నూల్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో తరగతులు నిర్వహించామని, హైదరాబాద్ మీడియా అకాడమీ ఆడిటోరియంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల జర్నలిస్టులకు, గిరిజన జర్నలిస్టులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 3న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యాక్ట్ చెక్, సైబర్ నేరాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌ను అకాడమీ నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ప్రముఖ ఉర్దూ జర్నలిస్ట్ మాజీద్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఆధునిక టెక్నాలజీని నేర్చుకుంటూ తమ రిపోర్టింగ్‌లో మెళకువలు పెంచుకోవాలన్నారు. పాత తరంలో జర్నలిస్టు అంటే నిజం తెలిపేవాడు అనే అభిప్రాయము ఉండేదని, అది మెల్లమెల్లగా పల్చబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





