అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య అంచనా ప్రకారం గాజాలో ప్రస్తుతం వెయ్యిమంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. గాజా ప్రాంత జనాబా రెండు మిలియన్లు. వీరిలో అత్యధిక సంఖ్యాకులు హస్పిటల్ కారిడార్లు, టెంట్లు, కార్లలో నిద్రపోతూ గడుపుతున్నారు. వీరిలో కొంతమంది డజన్లకొద్దీ తమ బంధువులను కోల్పోయి పెను విషాదంలో బతుకులీడుస్తున్నారు. కొంతమంది తమ పిల్లలకు దూరంగా ఉంటున్నారు. జర్నలిస్టులన్న పేరుతో ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేస్తుందన్న భయమే ఇందుకు కారణం. ప్రస్తుతం గాజాలో పరిస్థితి అత్యంత గంభీరంగా ఉంది..
దక్షిణ గాజాలోని నాజర్ హాస్పిటల్ ఫూటేజ్ చాలా భయంకరంగా వుంది. ఇజ్రాయిల్ దాడిలో గాయపడిన క్షతగాత్రులను నారింజ రంగు దుస్తులు ధరించిన సహాయక సిబ్బంది హాస్పిటళ్లకు తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఒక జర్నలిస్టు బూమ్ మైక్‌ను ధరించి, మరో జర్నలిస్టు స్మార్ట్ ఫోన్‌ను చేతులో పట్టుకొని, మెడలో కెమేరాతో ఈ బీభత్స దృశ్యాన్ని చిత్రీకరించే పనిలో బిజీగా వున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పెద్ద శబ్దంతో భయంకరమైన విస్ఫోటం. దట్టమైన పొగలు చుట్టూ ఆవరించడంతో ఏం కనిపించడంలేదు. ఒక్కసారిగా అంతటా అయోమయం నెలకొంది. హాస్పిటల్‌పై ఇజ్రాయిల్ జరిపిన వరుస దాడుల్లో మరణించిన 20మందిలో ఐదుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు!

‘ఇదొక విషాదకరమైన సంఘటన’ అని ఇజ్రాయిల్ ప్రధాని ఇక అరుదైన ప్రకటన చేసి ఊరుకున్నారు. వివిధ సంఘటనల్లో మృతిచెందిన జర్నలి స్టుల వివరాలను కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ 1990 నుంచి నమోదు చేస్తూ వస్తోంది. ఇది అందించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు గాజాలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్లి దుర్మరణం పాలైన జర్నలిస్టుల సంఖ్య 200. ఈవిధంగా ఒక ప్రాంతంలో జరిగే సంఘర్షణల్లో ఇంతటి స్థాయిలో జర్నలిస్టులు మరణించడం ఎక్కడా చోటుచేసుకోలేదని ఈ కమిటీ వెల్లడించింది. వీరిలో చాలామంది పాలస్తీనియన్లే. ముఖ్యంగా నిరాశ్రయులై, ఆకలితో అలమటిస్తున్న తమ కుటుంబ సభ్యుల దయనీయ స్థితిని బయటి ప్రపంచానికి వెల్లడించేందుకు వీరు ఎంతో కష్టపడ్డారు. గాజాలో యుద్ధం మొదలైన దగ్గరినుంచి విదేశీ జర్నలిస్టులకు ఇజ్రాయిల్ అనుమతి నిరాకరించింది. అప్పుడప్పుడూ సైన్యం సమాచారం అందిస్తూ వొచ్చింది. ఈ నేపథ్యంలో చాలా వరకు స్థానికులు అందించిన సమాచారంపైనే ఆధారపడి వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈనెల 25న గాజాపై ఇజ్రాయిల్ జరిపిన బాంబుదాడిని పరిశీలిస్తే గాజాలో వార్తలను సేకరించడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలుస్తోంది.
సోమవారం హాస్పిటల్‌పై ఎందుకు దాడి జరిపిందీ ఇజ్రాయిల్ కారణాలు వెల్లడించలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం హాస్పిటల్స్ పై ఎటువంటి దాడి జరపడానికి వీల్లేదు. అయితే హమాస్ ఈ హాస్పిటల్స్ ను, ఇతర రక్షిత ప్రదేశాలను కేంద్రంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నదని ఇజ్రాయిల్ చెబుతున్న మాట! కాల్పులు జరిగే ప్రాంతంలో జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తిస్తున్నారన్న సంగతిని ఎంతమాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలను ఇజ్రాయిల్ ఖండిస్తోంది. రెండువారాల క్రితం అల్ జజీరా విలేకరి అనాస్ అల్-షరీఫ్ ఇజ్రాయిల్ దళాల కాల్పుల్లో మరణించాడు. అయితే ఇతను హమాస్ సాయుధ దళాల విభాగంలో పనిచేస్తున్నాడని ఇజ్రాయిల్ ఆరోపణ . ఉత్తర గాజాలో ప్రెస్ టెంట్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు అసువులు బాసారు. సోమవారం హాస్పిటల్‌పై జరిగిన దాడిపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ప్రకటించారు. జర్నలిస్టులు, వైద్యసిబ్బంది, సాధారణ పౌరులకు ఇజ్రాయిల్ ఎంతో విలువ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తాము జరిపే యుద్ధం కేవలం హమాస్ పై మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆయన పైకి ఎన్ని మాటలు చెప్పినా, జరిగేది మటుకు అందుకు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన జర్నలిస్టుల్లో అల్ జెజీరా, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, మిడిల్ ఈస్ట్ ఐ మీడియా సంస్థలకు చెందినవారు!
అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య అంచనా ప్రకారం గాజాలో ప్రస్తుతం వెయ్యిమంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. గాజా ప్రాంత జనాబా రెండు మిలియన్లు. వీరిలో అత్యధిక సంఖ్యాకులు హస్పిటల్ కారిడార్లు, టెంట్లు, కార్లలో నిద్రపోతూ గడుపుతున్నారు. వీరిలో కొంతమంది డజన్లకొద్దీ తమ బంధువులను కోల్పోయి పెను విషాదంలో బతుకులీడుస్తున్నారు. కొంతమంది తమ పిల్లలకు దూరంగా ఉంటున్నారు. జర్నలిస్టులన్న పేరుతో ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేస్తుందన్న భయమే ఇందుకు కారణం. ప్రస్తుతం గాజాలో పరిస్థితి అత్యంత గంభీరంగా ఉంది . గాజా ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య రాకపోకలను ఇజ్రాయిల్ నిషేధించింది. సాధారణ ప్రజల మాదిరిగానే జర్నలిస్టులు కూడా, ఖాలీ చేయాలని వొచ్చే ఆదేశాలు, దాడులు చేస్తామన్న హెచ్చరికలు, సహాయం అందించడానికి వచ్చే కాన్వాయ్‌ల వద్ద జరిగే కొట్లాటల మధ్య బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఆయా మీడియా సంస్థల ఎడిటర్లు తమ రిపోర్టర్లకు ఇచ్చే ప్రతి అసైన్‌మెంట్‌లో దాగివుండే కష్ట నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వారివద్దనుంచి ఫోన్ కాల్ లేదా మెస్సేజ్‌లు ఎప్పటికప్పుడు అందకపోతే భద్రతా నిపుణుల సహాయం తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఒక్కసారిగా పెరిగిన ఇటువంటి మరణాలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒక ఫోటోగ్రాఫర్ మాట్లాడుతూ, నేను సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి రిపోర్ట్ చేయాలంటే చాలా భయపడాల్సి వొస్తున్నదని చెప్పాడు. గత జులై నెలలో జరిగిన దాడిలో ఒక విలేఖరి, తన కుమార్తెతో సహా గాయపడ్డారు. ఆయన మట్లాడుతూ సర్వత్రా భయం ఆవహించిఉందని, ఎవరికీ రక్షణ లేదంటూ చెప్పాడు.
గాజా నుంచి పనిచేసే విలేఖర్లు మొదట్నుంచీ ఏకపక్ష వార్తలే రాస్తారని ఇజ్రాయిల్ సైన్యం చెబుతున్న మాట. 2012-14 మధ్యకాలంలో ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం కొనసాగినప్పుడు, సైనిక రక్షణ లేకుండా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను సంఘర్షణ జరిగే ప్రాంతాలకు అనుమతించేవారు కాదు. ఫలితంగా స్వేచ్ఛగా రిపోర్టింగ్ చేయడం కష్టంగా ఉండేది. అసోసియేట్ ప్రెస్‌కు బ్యూరో చీఫ్‌గా పనిచేసిన డాన్ పెర్రీ మాట్లాడుతూ, ఇక్కడ హమాస్ తప్ప సమాచార సేకరణకు మరో సోర్స్ లేదని తెలిపారు. అంతర్యుద్ధం చోటుచేసుకునే ప్రాంతాల్లోకి జర్నలిస్టులను అనుమతించకుండా కఠినంగా వ్యవహరించే కొన్ని దేశాల సరసన ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా చేరింది. యుక్రెయిన్ యుద్ధంపై వార్తలు రాయడాన్ని ద్రోహంగా పరిగణిస్తామని రష్యా స్పష్టం చేసింది. అంతర్యుద్ధం సమయంలో సిరియా ప్రభుత్వం కూడా ఎంతో మంది జర్నలిస్టులను తమదేశంలోకి అనుమతించలేదు. ఫలితంగా ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలపై, స్థానిక సోషల్ మీడియాపై సమాచారం కోసం ఆధారపడాల్సి వొచ్చింది. మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలు కూడా విదేశీ జర్నలిస్టులను అనుమతించడంలేదు. గత వారం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 28 దేశాలు గాజాలోకి విదేశీ జర్నలిస్టులను అనుమతించాలని ఇజ్రాయిల్‌ను కోరాయి. ముఖ్యంగా యుద్ధం వల్ల కలుగుతున్న దారుణ పరిణామాలు ప్రపంచానికి తెలియా ల్సిన అవసరం ఉంది . ఈ పాత్రను జర్నలిస్టులు మాత్రమే సమర్థవంతంగా పోషించగలరని పేర్కొన్నాయి. ఈవిధంగా ప్రెస్‌ను నిషేధించడంపై 1300మంది జర్నలిస్టులు సంతకాలు చేసిన ఒక పిటిషన్‌లో ప్రభుత్వాలు, సైనికులు, సెన్సార్ షిప్, అణచివేత, ఎక్కడికక్కడ అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడటమంటే, ఆయా ప్రాంతాల్లో కొనసాగే అసలు వాస్తవాలను భూస్థాపితం చేయడం తప్ప మరోటి కాదని స్పష్టం చేయడం గమనార్హం.
( న్యూ యార్క్ టైమ్స్ సౌజన్యం తో )





