– డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
ముదిగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముదిగొండ మండల నాయకత్వం మొత్తం కాంగ్రెస్ పార్టీలో సోమవారం సాయంత్రం చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికే కాదు రాష్ట్ర ప్రగతికి వేస్తున్న పునాదులను చూసి జిల్లా స్థాయి నాయకులే కాదు శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్నారని అన్నారు. గత పాలకులు రూ. 26 వేల కోట్ల అప్పును 11.50 శాతంతో తీసుకువస్తే ఆ వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాం అన్నారు. గత పాలకులు ఉద్యోగులకు సంబంధించిన రూ.15 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పోయారు ..మా ప్రభుత్వం రాగానే నెలకు 700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నామని తెలిపారు. దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టు గత పాలకులు చంపేశారు, తిరిగి ఆ ప్రాజెక్టుకు ప్రజా ప్రభుత్వం జీవం పోస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. అందుకే మధిర నియోజకవర్గ ప్రజలకు వారు కోరుకున్న మేరకు సమయం కేటాయించలేకపోతున్నానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మధి ర నియోజకవర్గ ప్రజల విలువైన ఓటును వినియోగిస్తున్నానని అన్నారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేసేందుకు సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





