సికింద్రాబాద్-జోథ్‌పూర్ రైలు ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే కరీంనగర్, వరంగల్, బేగంపేట స్టేషన్లు అభివృద్ధి చేసి ప్రారంభించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ నుంచి జోథ్‌పూర్‌కు రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజస్థాన్ నుంచి ఇక్కడికొచ్చి నివసిస్తున్న వారు హైదరాబాద్-జోథ్‌పూర్ మధ్య నేరుగా రైలు సదుపాయం కల్పించాలని దాదాపు నలభయ్యేళ్లుగా కోరుతున్నారన్నారు. ఈ డిమాండ్‌ను ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ల దృష్టికి తీసుకెళ్లగా మోదీ ఆదేశాలతో అశ్వినీ వైష్ణవ్ స్పందించి సికింద్రాబాద్ నుంచి జోథ్‌పూర్‌కు రోజువారీ నేరుగా రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారున్నారు. ఈ రోజు స్వయంగా రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అశ్వినీవైష్ణవ్ హాజరవడం సంతోషకరమైన విషయమన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా సిబ్బందితో నడపడం గర్వించదగిన విషయమన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో రైల్వే కోచ్‌లు, వ్యాగన్ల తయారీ యూనిట్ నిర్మాణం ప్రారంభమైందని, ప్రధాని మోదీ ఆదేశాలతో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో అన్ని రైల్వే స్టేషన్లలో విద్యుదీకరణ పూర్తయిందని, వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720 కోట్లతో ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తున్న పనులు కొనసాగుతున్నాయని, వచ్చే సంవత్సరం ఈ కొత్త స్టేషన్ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్నతలు తెలియజేస్తున్నామన్నారు.




