18 కేజీల బంగారం అపహరణ?
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సూర్యాపేట, ప్రజాతంత్ర, జు 21 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ జువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. పట్టణంలో ఎంజి రోడ్డులోని సాయి సంతోషి నగల దుకాణంలో సుమారు 18 కేజీల బంగారాన్ని, లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. రోజుమాదిరిగానే యజమాని తెడ్ల కిశోర్ ఆదివారం దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం షాపు తెరచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సుమారు 18 కేజీల నగలను దోచుకెళ్లినట్లు అంచనా వేస్తున్నామని బాధితుడు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నగల దుకాణం వెనుక నుంచి బాలాజీ గ్రాండ్ ఎదురుగా ఉన్న రెండు బాత్‌రూంలలోకి రంధ్రం చేశారని, గ్యాస్ కట్టర్లతో షాపు షట్టర్లను తొలగించి దొంగలు లోపలికి వెళ్లారని తెలిపారు. దొంగల ముఠాను పట్టుకోవడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు జరిపి నిందితులను త్వరలెనే పట్టుకుంటామని ఎస్పీ వెల్లడిరచారు. దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీి ప్రసన్నకుమార్, సీసీిఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, పోలీసు టెక్నికల్ టీమ్స్, క్లూస్ టీం సిబ్బంది ఉన్నారు.





