– రేవంత్ రెడ్డే టార్గెట్
– ఫలించని బుజ్జగింపులు
(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల మాజీ ఎంఎల్యే టి.జీవన్ రెడ్డి ప్రకటించినట్లు ఆయన రాజీనామా ముహూర్తం రానేవచ్చింది. తన రాజీనామా విషయంలో ఆయన చాలా క్లారిటీగానే ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమన్న విషయం స్పష్టమవుతున్నది. అయితే ఇది జీవన్ రెడ్డితోనే ఆగుతుందా మరికొందరు కాంగ్రెస్ వీడే అవకాశముందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. జీవన్ రెడ్డిలాగా పార్టీలో మరికొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు వినికిడి. అయితే వారు జీవన్ రెడ్డి లాగా బహిర్గతం కావడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తున్నది. కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రం గుర్రుగానే ఉన్నారు. ఆయన ఆగ్రహమంతా కేంద్ర నాయకత్వంపైనే. గత ఎన్నిక ల్లో బిజెపినుండి కాంగ్రెస్ లోకి రావడానికి కేంద్ర నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చిన మేరకు మంత్రి పదవిని ఇవ్వలేదన్నది ఆయన కోపానికి ప్రధాన కారణం. తనకు మంత్రి పదవి ఇవ్వకున్నా, సరాసరి సీఎం అయ్యే సత్తా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారితీసాయి. ఇది లా ఉంటే కాంగ్రెస్ అంతర్గత విభేదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుండి ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తి చోటుచేసుకున్న విషయం బహిరంగ రహస్యమే. పార్టీలో సీనియర్స్ చాలామంది ఉన్నా రేవంత్ రెడ్డి కి పగ్గాలు అప్పగించడం పట్ల సీనియర్లు కొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఎప్పుడైతే 2023 ఎన్నికల్లో రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందో అసంతృప్తి వెనుకబడింది. అయితే రాష్ట్ర మంత్రి వర్గం కూర్పులో మరోసారి ఈ అసం తృప్తి పొడసూపింది. రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరిన టిడిపి నాయకులకే పదవు ల్లో ప్రాధాన్యత ఇస్తున్నా రన్నది వారి ప్రధాన ఆరోపణ. క్రమేణ పార్టీలో తమ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారన్నది సీనియర్ల నుండి అడపాతడపా వినిపిస్తున్నది. తాజాగా శాసనసభలో విప్‌ల నియామకం విషయమైతేనేమీ, అంతకు ముందు మంత్రి వర్గాన్ని విస్తరించినప్పుడు అయితేనేమీ ఇతర పార్టీలనుండి వచ్చినవారిని తీసుకుంటూ దశాబ్దాలుగా కాంగ్రెస్ జండా మోస్తున్నవారిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నది వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఆరోపణతోనే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ వీడడానికి సిద్దపడ్డారు. తాను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికూడా కారణంగా ఆయన వేలెత్తి చూపుతున్నారు. గడచిన 42 ఏళ్ళుగా పార్టీకి లాయల్‌గా పనిచేసిన తనను రేవంత్‌రెడ్డి పట్టించుకోవడంలేదని ఆయన బాహాటంగానే ప్రకటిస్తున్నారు. 20 నెలలుగా తాను మానసిక క్షోభకు గురై రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం పార్టీ ఓడిపోయినా శాసనమండలిలో తాను ఒంటరి పోరాటంచేసినా గుర్తింపుకూడా పార్టీకి లేకుండా పోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రిపదవి ఇవ్వకుండా కావాలని పక్కకు పెట్టారని, కనీసం ఎంఎల్సీ పదవినికూడా తిరిగి ఇవ్వకపోవడాన్ని ఆయన ఎత్తిచూపుతున్నారు. పైగా గత ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా పోటీచేసిన వ్యక్తిని తన అనుమతిలేకుండా, కనీసం తనకు ఏమాత్రం సమాచారం లేకుండా కాంగ్రెస్ కండువ కప్పడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను చెప్పిన వారికి కాకుండా తనపై బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆయన అవమానంగా భావిస్తూ, ఇక తాను కాంగ్రెస్‌లో కొనసాగలేనన్న నిర్ణయానికి వచ్చారు. అయితే పార్టీలో సీనియర్‌నేత, ఇంతవరకు ఏనాడు పార్టీ ఫిరాయించనివాడు, వివాద రహితుడిగా పేరున్న జీవన్‌రెడ్డిని ఎట్టిపరిస్థితిల్లోనూ వదులుకోమని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనతో ముఖాముఖి మాట్లాడిందిలేదు. కాకపోతే మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌లు ఆయనకు సర్థిచెప్పడానికి ప్రయత్నించినా లాభంలేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో జీవన్‌రెడ్డితో మాట్లాడారు. పిసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి, కరీంనగర్ డిసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎంఎల్‌ఏ మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్‌రెడ్డి ఇంటికివచ్చి సర్థిచెప్పడానికి ప్రయత్నించారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ జీవన్‌రెడ్డిని రాజీనామా చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా జీవన్‌రెడ్డి తనపట్టు వీడకున్నారు. ఒక్కసారి చెబితే…నామాట నేనే విన.. అన్నట్లుగానే ఆయన తన అనుచరగణంతో ఈ నెల 25న కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయడానికి . కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజీనామా అనంతరం కొంతకాలం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నట్లు జీవన్‌రెడ్డి ప్రకటించినప్పటికీ ఇతర పార్టీలు ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్దంగా ఉన్నాయి. అధిష్టానం ఆదేశిస్తే జీవన్‌రెడ్డిని తన భుజాలపై మోసుకొస్తానని కోరుట్ల బీఆర్‌ఎస్ ఎంఎల్యే కల్వకుంట్ల సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. సీనియర్ నాయకుడిని తమ పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి కూడా ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తున్నది. రాజీనామాకు మరి కొన్ని గంటల సమయమే మిగలటంతో పరిణామాలు ఎటుమారుతాయో చూడాలి మరి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




