నిబద్ధత కలిగిన నేత జీవన్‌రెడ్డి

– కేసీఆర్-జీవన్‌ల అనుబంధం ఈనాటిది కాదు
– సీఎం రేవంత్, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
– కేసీఆర్ మళ్లీ సీఎంగా రావాలంటున్న ప్రజలు
– జగిత్యాల వెళ్లి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : రాష్ట్రంలో రైతులు, పేదలు సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా రావాలి అని ప్రజలు కోరుకుంటున్నట్లు బీఆరఎస్ వర్కింగ్´ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకు కేటీఆర్ జగిత్యాలలోని అయన నివాసానికి గురువారం వెళ్లారు. అంతకుముందు జగిత్యాల శివారులో బీఆరఎస్ శ్రేణులు కేటీఆర్‌కు స్వాగతం పలికాయి. అక్కడినుంచి బైక్ ర్యాలీతో జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ రాకతో జీవన్ రెడ్డి నివాసంతోపాటు జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి జీవన్ రెడ్డిని కలుసుకుని అధినేత కేసీఆర్ తరఫున అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ ఆహ్వానానికి జీవన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. కేసీఆర్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం ఉంది.. మీరు అందరూ వచ్చి ఆహ్వానించడం సంతోషంగా ఉంది.. త్వరలో కేసీఆర్‌ని కలిసి రెండుమూడు రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తాను అని జీవన్‌రెడ్డి తెలిపినట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే అనుభవజ్ఞులైన నాయకుల అవసరం ఉందని, అందుకే జీవన్ రెడ్డి సహకారం కోరుతున్నామని తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో సేవలందించిన నిబద్ధత కలిగిన, నిజాయతీపరుడైన నాయకుడని కొనియాడారు. 2014లో కూడా కేసీఆర్ ఆయనను బీఆరఎస్‌లోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌పై ఉన్న నిబద్ధతతో వారు అందులోనే కొనసాగారని చెప్పారు. కేసీఆర్-జీవన్ రెడ్డి మధ్య నాలుగు దశాబ్దాలకుపైగా ఉన్న వ్యక్తిగత అనుబంధం, పరస్పర గౌరవం రాజకీయాలకు అతీతమని కేటీఆర్ వివరించారు. ఎలాంటి సంకోచం లేకుండా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ముందుకొచ్చిన జగిత్యాల జిల్లా నాయకత్వానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. జీవన్ రెడ్డి చేరిక కచ్చితంగా బీఆరఎస్‌కు అద్భుతమైన బలాన్ని చేకూరుస్తుందని చెప్పిన స్థానిక నాయకులు, జీవన్ రెడ్డిని ఆహ్వానించేందుకు వారు చేసిన కృషిని అభినందించారు. రెండు సందర్భాల్లో నా కండ్ల ముందు జరిగినయ్ గుర్తొస్తున్నాయన్నారు. 2014 జూన్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల్లో వారి మొట్టమొదటి అధికారిక ప్రకటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే మొదలైంది. జీవన్ రెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే.. ఆరోజు కేసీఆర్ స్వయంగా ముందు జీవన్ రెడ్డికి మైక్ ఇవ్వండి అని చెప్పి వారికి మైక్ అందిస్తే నేరుగా అభినందనలు చెప్పి బోర్నపల్లి గ్రామానికి ఒక బ్రిడ్జి కావాలని ఒక్క మాట అడిగారు. అప్పుడే మేం కొత్తగా మంత్రులైనం. కేసీఆర్ ఎట్లా స్పందిస్తరు చూస్తా ఉన్నం. సాధారణంగా చూస్తాం.. పరిశీలిస్తాం అని చెప్పొచ్చు.. కానీ జీవన్ రెడ్డిపై ఉన్న గౌరవం, ప్రేమ ఎట్టాంటిదంటే కేసీఆర్ రూ.70 కోట్లతో కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి బ్రిడ్జిని మంజూరు చేశారని కేటీఆర్ తన అనుభవాన్ని వెల్లడించారు. అసెంబ్లీలో ఎప్పుడూ ప్రజా సమస్యల గురించి ముఖ్యంగా రైతుల తరపున చాలా గట్టిగా మాట్లాడే నాయకుడని కొనియాడారు. జగిత్యాల జిల్లాలో నిజాం షుగర్స్ చాలా ముఖ్యమైనదని.. దాన్ని ఖచ్చితంగా తెరిపించాల్సిందేనని విద్యాసాగర్ రావు, జీవన్ రెడ్డిలు కొట్లాడేవారు. షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా తెరిపించాల్సిందే.. మేం కూడా మాటిస్తున్నాం. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో అక్కడి షుగర్ మిల్లులు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నయ్. టెస్కాబ్ చైర్మన్, మాజీ అధ్యక్షుడు రవీందర్ రావు కూడా ఇక్కడే ఉన్నరు. అట్లా కో ఆపరేటివ్ వ్యవస్థను బాగు చేస్తే బాగుంటది జీవన్ రెడ్డి గారూ.. ఒకవేళ మీకు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి రూ.250 నుంచి రూ.300 కోట్లు పెట్టేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నామని.. అవసరమైత మీరే దానికి చైర్మన్‌గా ఉండండి అని కేసీఆర్ ఎలాంటి భేషజానికి పోకుండా శాసనసభలో జీవన్ రెడ్డికి ఓపెన్‌గా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్లుగా పూర్తిగా వైఫల్య పాలనను కొనసాగిస్తోందని, ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా రూ.27 వేల కోట్ల బకాయిలు పెడుతూ మరోవైపు రుణ మాఫీ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్నారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి  అమలు చేయకుండా యువతను మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతలో నిరాశ, ఆగ్రహం పెరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీలలో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని అన్నారు. ఆర్థిక పరిస్థితి తెలుసుకొని హామీలు ఇచ్చామని చెప్పి ఇప్పుడు వెనక్కి తగ్గడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపలే అసంతృప్తి పెరుగుతోందని, ఆ పార్టీ కార్యకర్తలే బీఆరఎస్ ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వం తమ సీనియర్ నేతలను అవమానిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారం మత్తులో అహంకారంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. బీఆరఎస్ పార్టీ మళ్లీ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *