jayashankar: జయశంకర్‌ సార్‌ సేవలను వెలకట్టలేం

– ప్రత్యేక రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికారు
– మాజీ మంత్రి హరీష్‌రావు నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్‌ సార్‌ అని మాజీ మంత్రి హరీష్‌రావు కొనియాడారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన కృషి ఎప్పటికీ వెలకట్టలేమని పేర్కొన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. భవిష్యత్‌ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో వారి జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ చేర్పించారని గుర్తుచేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాలకు వారి పేరు పెట్టడంతోపాటు, ఏటా ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా నిర్ణయించారని తెలిపారు. జయశంకర్‌ సార్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారి మార్గంలో పయనించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని హరీష్‌రావు పేర్కొన్నారు.

మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసు చర్యలు బాధాకరం

కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు రోజురోజుకూ దిగిజారిపోతున్నాయని, మొట్టమొదటి మహిళా హోంమంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్‌రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మహిళా సభ్యురాలి పట్ల ఇంత కర్కశంగా, అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రేషన్‌ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే సబిత చేసిన తప్పా అని ప్రశ్నించారు. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్‌ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. సబితపై అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని హరీష్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *