కోదాడ ప్రజలకు తీపి కబురు

– జవహర్‌ నవోదయ విద్యాలయం మంజూరు
శాశ్వత భవన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు
– గ్రామీణ ప్రతిభావంతులకు ఉచిత నాణ్యమైన విద్య
– ఫలించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కృషి

కోదాడ, ఆగస్టు 9: గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉండి వెనుకబడిపోతున్న విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన సీబీఎస్‌ఈ విద్యను అందించేందుకు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జవహర్‌ నవోదయ విద్యాలయం మంజూరైంది.
శాసనసభ్యురాలు ఉత్తమ్‌ పద్మావతీరెడ్డి అభ్యర్థన మేరకు నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.50 కోట్ల నిధులతో కోదాడ నియోజకవర్గ కేంద్రంలో జవహర్‌ నవోదయను ఏర్పాటు చేయించాలని పట్టుబట్టి మరీ సాధించారు. కోదాడ నియోజకవర్గ కేంద్రంలోనీ బాలాజీనగర్‌ ప్రాంతంలో ఉన్న కె.ఆర్‌. ఆర్‌ కళాశాల సమీపంలో 19.12 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతీ రెడ్దిలు తెలిపారు. గ్రామీణ భారతాన్ని అక్షరాస్యతలో అగ్రగామిగా నిలబెట్టేందుకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 1986లో జవహర్‌ నవోదయ విద్యాలయాల వ్యవస్థను ప్రారంభించిన విషయం విదితమే. 6 నుండి 12 తరగతుల వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉచిత భోజనం, వసతి, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందించి అక్షరాస్యతలో భారతదేశాన్ని సింహ బాగంలో ఉంచాలన్నది రాజీవ్‌ గాంధీ సంకల్పం. గ్రామీణ భారతంలో ప్రతిభ ఉండి చదువుకు అవకాశాలు లేని విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసే ఈ విద్యాసంస్థల ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ పాఠశాల ఏర్పాటులో మంత్రి ఉత్తవమ్‌, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిల కృషి అభినందనీయమని ఈ ప్రాంత విద్యాధికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *