జనక్‌ ప్రసాద్‌కు మతి భ్రమించింది

– రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదనే కవితపై ఆరోపణలు
– హెచ్‌ఎంఎస్‌ నాయకుల విమర్శలు

గోదావరిఖని, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్‌ కలయికతో ఐఎన్టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌కు నిద్ర పట్టడం లేదని హెచ్‌ఎంఎస్‌ సింగరేణి విభాగం అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, ఆర్‌జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్‌, ఆర్‌జి-1 ఏరియా బ్రాంచి కార్యదర్శి పల్లె క్రాంతికుమార్‌లు విమర్శించారు. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించి హెచ్‌ఎంఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. గతంలో ఒక యూనియన్‌కు గౌరవ అధ్యక్షురాలిగా మాత్రమే పనిచేసినప్పటికీ కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో సుమారు 20 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలిప్పించిన ఘనత ఆమెదని తెలుసుకోవాలన్నారు. అలాంటి కారుణ్య నియామకాలను కరప్షన్‌ నియామకాలుగా మార్చి పైరవీలు చేసుకుంటున్నది నీవు కాదా అని ప్రశ్నించారు. కారుణ్య నియామకాలను యాజమాన్యం పాతర పెట్టి 49మంది కార్మికుల జీవితాలను నాశనం చేస్తా ఉంటే నీకు, మీ ప్రభుత్వానికి సోయి లేదేమని నిలదీశారు. ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో బంగారం, రాగి గనులతో సింగరేణిని విస్తరింప చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం వీటివల్ల తెలంగాణలో కోల్‌బెల్టు ప్రాంత నిరుద్యోగ యువకులకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో దమ్ముంటే చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. నీకు, మీ ప్రభుత్వానికి కొట్లాడడం చేతకాకనే బొగ్గు గనుల వేలం పాటకు మద్దతుగా బీజేపీి కాళ్ల దగ్గర దాసోహం అవ్వడం వాస్తవం కాదా అని నిలదీశారు. కాంట్రాక్టు కార్మికుల వల్లనే లాభాలొస్తున్నాయని సిగ్గు లేకుండా ప్రకటించి కాంట్రాక్టు కార్మికులు, పర్మనెంట్‌ కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్‌ఎంఎస్‌ నాయకులు హితవు పలికారు.
కనీస వేతనాల మండలి నాయకునిగా ఉన్న జనక్‌ ప్రసాద్‌ కాంట్రాక్టు కార్మికులు ఎంతమందికి సమాన పనికి సమాన వేతనం ఇప్పించారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. గోదావరిఖనిలో ఒక కాంటాక్ట్‌ కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇప్పించి నీవు, నీ సంఘాలు కాంట్రాక్టర్‌ పక్షాన చేరడం వాస్తవం కాదా? ఆ తర్వాత ఆర్‌జీ-1 ప్రమాదం జరిగి మరో కాంట్రాక్టు కార్మికుడు చనిపోతే హెచ్‌ఎంఎస్‌ నాయకుడు రియాజ్‌ అహ్మద్‌ రూ.40 లక్షల పరిహారం ఇప్పించి కాంట్రాక్టు కార్మికుల పక్షాన నిలబడిరది గుర్తుంచుకోవాలన్నారు. 2023 డిసెంబర్‌లో సింగరేణిలో ప్రాతినిధ్య సంఘంగా ఎన్నికైన ఐఎన్‌టియుసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఇప్పటివరకు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని సారయ్య, కిరణ్‌, క్రాంతికుమార్‌లు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నూతన భూగర్భ గనులు రావాలని, ఐటీ రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని, సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని, అవినీతి నిర్మూలన, మారు పేర్లను క్రమబద్ధీకరించాలని, మెడికల్‌ బోర్డు రెగ్యులర్‌గా నిర్వహించి దరఖాస్తు చేసుకున్న అందరినీ అన్‌ఫిట్‌ చేసి వారసులకు ఉద్యోగాలివ్వాలని కవిత పోరాటాలకు శ్రీకారం చుడితే మీకు వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు. దమ్ముంటే మీ మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కవితపై ఆరోపణలు మానుకోకుంటే సింగరేణివ్యాప్తంగా హెచ్‌ఎంఎస్‌, జాగృతి సంస్థల ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని జనక్‌ప్రసాద్‌ను హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *