Padayatra: హైక‌మాండ్ ఆదేశాల మేరకే పాదయాత్ర

– ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న‌
– బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
– విూడియాతో చిట్‌చాట్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేస్తున్నామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు కూడా నేరుగా వచ్చి కలుస్తున్నారని అన్నారు. గాంధీభవన్‌లో విూడియాతో చిట్‌చాట్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ప్రతినెలా కొన్ని నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర చేస్తానని, ఈ నెల చివరి వారంలో దీనికి రెండో దశ ఉంటుందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల దిల్లీ ధర్నాకు ఖర్గే, రాహుల్‌ గాంధీ రాలేకపోయారని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ పరిశీలిస్తోంది.. కొండా మురళి వ్యవహారం త్వరలో ముగిసిపోతుంది.. అనిరుధ్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.. వివరణ కూడా తీసుకున్నాం అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బీసీల కోరిక న్యాయబద్ధమైనదని, ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని తెలిపారు. బీసీ జనాభా లెక్కలు తెలుసుకునేందుకే కులగణన జరిగిందని, ఆ తర్వాతే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని మహేష్‌కుమార్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ హావిూ మేరకు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో..42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు బిల్లులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చట్టం ఉందని, దాన్ని అధిగమించేందుకే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు. నాలుగు నెలలు గడుస్తున్నా బిల్లులను రాష్ట్రపతి ఆమోదించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దిల్లీలో ధర్నాకు రాహుల్‌, ఖర్గే రాకపోవడంపై గల్లీ లీడర్లలా కిషన్‌రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ జేబులో పెట్టుకొని తిరుగుతోందని మహేష్‌కుమార్‌ విమర్శించారు. అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకు పోతోందన్నారు. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్రంగా చర్చించి ముందకు వెళ్తామంటూ బండి సంజయ్‌ ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారంటూ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ శిఖండి పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ది ఉంటే దిల్లీ ధర్నాలో బీఆర్‌ఎస్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *