పేదల కోసమే ‘ఆయుష్మాన్‌ భారత్‌’

` గవర్నర్‌తో కలిసి జన ఔషధి పరియోజన గోదాం ప్రారంభం
– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: జీవన విధానంలో మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని, ప్రతి వందమందిలో 95మంది వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, పదవీ విరమణ చేసిన వారు పెన్షన్‌ మొత్తం వైద్య ఖర్చుల కోసమే వెచ్చించాల్సి వస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ వేర్‌హౌజ్‌ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. పేద,మధ్య తరగతి ప్రజలు అనారోగ్యం పాలైతే జీవితంలో సంపాదించిన మొత్తం వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్‌ భారత్‌ ఫథకాన్ని తీసుకొచ్చి ఏ హాస్పిటల్‌లోనైనా చికిత్స పొందే వెసులుబాటు కల్పించారుని చెప్పారు. 70 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. తెలంగాణలో బస్తీ దవాఖానాల్లో వెల్‌నెస్‌ సెంటర్లను ప్రవేశపెట్టామని, ఈ వ్యవస్థ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తోందని, అలాగే ఔషధాలను చాలా తక్కువ ధరకే అందించి, ప్రజల జేబులకు చిల్లులు పడకుండా ఉండేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టిందని ఆయన వివరించారు.
సాధారణ మెడికల్‌ దుకాణాల్లో ధరలతో పోలిస్తే 50 నుంచి 90 శాతం వరకు తక్కువ ధరకే మందులను అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు తక్కువ ధరలకే మందులు అందించేందుకు పెద్ద ఎత్తున జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తున్నామన్నారు. వీటికి సంబంధించి డిపోను తెలంగాణలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయకుండా తాత్సారం చేశారని ఆరోపించారు. అలాకాక రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కిషన్‌రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *