– వృద్దాప్య సమస్యలతో మరణించినట్లు ప్రకటన
న్యూయార్క్, నవంబర్ 8: జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో 97ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూయార్క్‌లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉన్న డీఎన్‌ఏ నిర్మాణాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని పిలుస్తారు. ఈ అమరికను కనుగొన్నందుకు బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్రాంసిస్ క్రిక్, మారిస్ విల్కిన్స్‌లతో కలిసి జేమ్స్ డీ వాట్సాన్ 1962లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. డీఎన్‌ఏకు సంబంధించి రొసాలిండ్ ఫ్రాంక్లిన్, మారిస్ విల్కిన్స్ రూపొందించిన ఎక్స్ రే చిత్రాల ఆధారంగా వాట్సాన్, క్రిక్‌లు 1953లో డబుల్ హెలికల్ స్ట్రక్చర్‌ను వివరించారు. 1958లోనే ఫ్రాంక్లిన్ కన్నుమూయడంతో ఆమెకు నోబెల్ దక్కలేదు. జేమ్స్ 1928లో చికాగోలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండియానా యూనివర్సిటీలో జన్యుశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 1951లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కావెండిష్ లేబొరేటరీలో చేరారు. అక్కడే ఆయనకు క్రిక్ పరిచయమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి డీఎన్‌ఏ అమరిక గురించి తెలుసుకునేందుకు విస్తృత పరిశోధనలు చేశారు. చివరకు జీవం గురించి కీలక రహస్యాన్ని ఛేదించారు. మానవ జన్యుక్రమాన్ని తెలుసుకునేందుకు ప్రారంభించిన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు జేమ్స్ 1990లో నేతృత్వం వహించారు. అయితే ప్రభుత్వ విధానాలతో విభేదించి కొంత కాలానికే తప్పుకున్నారు. 2007లో ఓ పత్రికా ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక వాట్సన్, క్రిక్‌ల ఆవిష్కరణ జీవశాస్త్రంలో అనేక మార్పులను తెచ్చింది. జెనెటిక్ ఇంజినీరింగ్, జీన్ థెరపీ, బయోటెక్నాలజీ వంటి ఆధునిక శాస్త్రాలకు పురుడు పోసింది. డీఎన్‌ఏ ఆవిష్కరణకు సంబంధించి తన అనుభవాలను వివరిస్తూ వాట్సన్ 1968లో ది డబుల్ హెలిక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





