రాష్ట్ర సాధనలో జైపాల్‌ కృషి ఎనలేనిది

– జైపాల్‌ రెడ్డి వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం
– కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ ముద్దుబిడ్డ, విలువల విఖ్యాతకుడు ఎస్‌.జైపాల్‌ రెడ్డి అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జైపాల్‌ రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన మెమోరియల్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. అభివృద్దే లక్ష్యంగా రాజకీయాలకతీతంగా గణనీయమైన సేవలందించారని, యువతరానికి ఆయన ఆదర్శనీయుడని, అజాతశత్రువు అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి, ఎంపీ, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారని, హైదరాబాద్‌ మెట్రో, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి ఎంతో కృషి చేశారని, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులకురూ.10వేల కోట్లు, అలాగే నల్గొండ జిల్లాకు రూ.400 కోట్లు కేటాయించారని చెప్పారు. విశిష్ట సేవలందించిన వ్యక్తిగా జైపాల్‌రెడ్డిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న అందించాలని కోరారు. కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ జైపాల్‌ రెడ్డి , కేంద్ర మంత్రిగా అటు దేశానికి, ఇటు తెలంగాణకు ఎన్నో విలువైన సేవలందించారని, విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారని, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకోవటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా ఎదిగారని, నేటి తరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జైపాల్‌ రెడ్డి కుటుంబాన్ని శాసనసభ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పరామర్శించారు. జైపాల్‌ రెడ్డి ఘాట్‌ వద్ద స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌, మాజీ ఎంపీలు హనుమంతరావు, రవీంద్ర నాయక్‌, మధుయాష్కీ గౌడ్‌, ఎమ్మార్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, స్వర్గీయ జయపాల్‌ రెడ్డి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పుర ప్రముఖులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *