– వచ్చే సంవత్సరం లక్షమందితో బతుకమ్మ నిర్వహిస్తా
– ‘స్థానిక’ ఎన్నికలపై గందరగోళం తొలగించాలి
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్1 : బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన ఆమె ప్రస్తుతం తెలంగాణలో సోయి లేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. బతుకమ్మ నిమజ్జనంలో సీఎం పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయమేనన్న కవిత అయితే గిన్నిస్ రికార్డు కోసం బతుకమ్మను వాడుకోవడం ఎందుకని ప్రశ్నించారు. కేవలం పది వేల మంది మహిళలతో బతుకమ్మ నిర్వహించి అవమానపరిచారని విమర్శించారు. వచ్చే సంవత్సరం లక్షమంది మహిళలతో బతుకమ్మ జరిపి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదిస్తామని కవిత ప్రకటించారు. బీసీ కులగణన చేపట్టినప్పుడు తప్పు అన్నారు.. కానీ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల జీవో ఇచ్చిన వెంటనే కేసులు వేశారని కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి సన్నిహితులే ఈ కేసులు వేశారని ఆరోపించారు. బీసీ హక్కుల కోసం బీఆర్‌ఎస్ ఉద్యమిస్తే మంచిదని సూచించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై కూడా కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరూ పోటీ చేయొద్దంటూ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఈటల వ్యాఖ్యలు వ్యక్తిగతమేనా.. లేక బీజేపీ స్టాండ్ అని ప్రశ్నించారు. మహారాష్ట్రలా ఎన్నికలు రద్దవుతాయని ఈటల చెప్పడం కోర్టులను ప్రభావితం చేసే ప్రయత్నమేనని విమర్శించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసినప్పటికీ వర్గీకరణ వారీగా రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నెల 8న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడిరచారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో ఇంకా స్పష్టత లేదని, పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిమరమ్మతు పనులు ప్రభుత్వం చేపట్టడం స్వాగతించదగ్గ విషయమన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





