– బీఆర్ఎస్ శత్రువుల మాటలనే వల్లె వేస్తున్నారు
– ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్
సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కవిత కూడా అవే పదాలను వల్లె వేస్తున్నారని ఆక్షేపించారు. సూర్యాపేటలోని తన కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కవిత గురించి మాట్లాడటం వృథా అన్నారు. నల్గొండ జిల్లాలో పాతికేళ్లల్లో జరిగిన ఉద్యమాలకు, గెలుపునకు తాను బాధ్యత అయితే ఓటమికి తాను బాధ్యుడనని, పార్టీయే ఫైనల్ అని స్పష్టం చేశారు. వ్యక్తులుగా ఏదో చేస్తామని అంటే వారి భ్రమ అని అన్నారు. తాను పార్టీకి సైనికుడునని ఉద్ఘాటించారు. తాను కేసీఆర్‌ను ఈ మధ్య కాలంలో 50సార్లు కలిశానని గుర్తుచేశారు. కేసీఆర్‌తో బనకచర్ల, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైనే చర్చించామని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకపోతే ఎవరమూ లేమని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చిచెప్పారు. తాను చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కానీ కొంతమంది గెలవలేదు కదా అని ప్రశ్నించారు. కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని, తాను చూసి ఉంటే స్పందించేవాడినని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.





