– ఆయన ఆరోగ్యంపై ఆందోళన
– ఆయనతో మాట్లాడాలని అనుకున్నా సాధ్యం కాలేదు
-హోంమంత్రి అమిత్ షాకు శివసేన ఎంపి సంజయ్ రౌత్ లేఖ
న్యూదిల్లీ, ఆగస్ట్ 11: రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagadeep Dhakar) ఆచూకీ చెప్పాలంటూ శివసేన నేత సంజయ్ రౌత్ (Shivasena MP Rowth) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఆయనతో సంప్రదించాలని చూసినా ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామా దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణాలతోనే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ దీనిపై విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల వేళ తాజాగా శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ధన్‌ఖడ్‌ను తాము ఫోన్‌లో కూడా కలవ లేకపోతున్నామని, ఆయన ఎక్కడున్నారో చెప్పాలని కోరారు. మన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడున్నారన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఆయన ప్రస్తుత లొకేషన్ ఏంటి? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? వంటి ప్రశ్నలపై స్పష్టత రావట్లేదు. ధన్‌ఖడ్‌తో మాట్లాడేందుకు కొంతమంది రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆయనను, ఆయన సిబ్బందిని సంప్రదించలేకపోతున్నాం. ఇది చాలా ఆందోళనకరం. ధన్‌ఖడ్‌కు ఏం జరిగింది? ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా? ఈ ప్రశ్నలపై దేశ ప్రజలకు సమాధానం కావాలని సంజయ్ రౌత్ తన లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖను సంజయ్ రౌత్ ఆదివారం పంపించగా సోమవారం ఎక్స్ ఖాతాలో దీని గురించి పోస్ట్ చేశారు. ధన్‌ఖడ్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని అనుకుంటున్నట్లు వెల్లడిరచారు. సుప్రీంకోర్టుకు వెళ్లేముందు దీనిపై విూ నుంచి సమాచారం కోరడం ఉత్తమమని భావించాం. మా ఆందోళనలను అర్థం చేసుకుని మాజీ ఉపరాష్ట్రపతి ఆచూకీ చెబుతారని విశ్వసిస్తున్నాం అని ఆ లేఖలో పేర్కొన్నారు. గత వారం పలువురు విపక్ష నేతలు కూడా ధన్‌ఖడ్ సమాచారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించారు. జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.





