– సమావేశాల నిర్వహణపై హరీష్ రావు అసంతృప్తి
హైదరాబాద్ ,ప్రజాతంత్ర, మార్చి 16:తెలంగాణ శాసనసభ బ్జడెట్ సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌లో పనిదినాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది ప్రజా సమస్యలపై చర్చను నీరుగార్చడమేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి సభ నడిచేది వారం రోజులు కూడా ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు. సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి పండుగలతో పాటు రెండు ఆదివారాలు వస్తున్నాయని, ఆ ఐదు సెలవు దినాలను మినహాయిస్తే చర్చకు చాలా తక్కువ సమయం మిగులుతుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. సమావేశాల అజెండాపై క్లారిటీ ఇస్తూ, మార్చి 17, 18 తేదీలలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుందని, ఆ తర్వాత మార్చి 20వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని ఆయన వెల్లడించారు. అయితే, బ్జడెట్ వంటి కీలక అంశంపై సమగ్రంగా చర్చించే అవకాశం లేకుండా ప్రభుత్వం షెడ్యూల్‌ను కుదించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సెలవుల వల్ల తగ్గిన పనిదినాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 29వ తేదీ ఆదివారం కూడా సభను నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై స్పందించిన హరీష్ రావు ఆదివారం సభ పెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమకు కావాల్సింది చర్చకు తగిన సమయం మాత్రమేనని, ప్రజల పక్షాన గళం వినిపించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి బ్జడెట్‌ను ఆమోదింపజేసుకోవాలని చూస్తోందని, దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆయన విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.