ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించినట్లు ప్రచారం
వాషింగ్టన్,మార్చి3: ఆధునిక యుద్ధవిద్యలో ఇప్పుడు పక్కాగా సమాచార సేవకరణ, దానిని అమలు పర్చడంలో అమెరికా-ఇజ్రాయెల్ విజయం సాధించాయని విదేవీ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పక్కా ప్లాన్‌తో దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు..? తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళ్తారన్న ప్రతి విషయాన్ని యూఎస్, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేశాయని వెల్లడించాయి. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారుల్ని కూడా ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. మాకు జెరూసలెం గురించి ఎంత తెలుసో టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు అని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించిందని అంటున్నారు. కొన్నేళ్లక్రితమే సుప్రీం లీడర్‌ను తమ టార్గెట్‌లో పెట్టుకొన్న ఇజ్రాయెల్ ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్‌వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. రాజధాని టెహ్రాన్‌లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్లపాటు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు వెల్లడించారు. ఆ ఫుటేజీని ఎప్పటికప్పుడు ఎన్‌క్రిప్ట్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నట్లు పేర్కొన్నారు. టెహ్రాన్‌లోని పెస్టర్ స్ట్రీ సమీపంలోని సుప్రీం లీడర్‌కు చెందిన కాంపౌండ్‌లో రోజూవారీ కార్యకలాపాలను, ఖమేనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలను పార్క్ చేసిన ప్రదేశాలను ఒక కెమెరాతో నెతన్యాహు ప్రభుత్వం నిత్యం గుర్తించేదని ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న కూడా అత్యంత కచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడింది. ఇరాన్‌లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతీ వారం ప్రారంభం రోజున శనివారం తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకొని దాడి చేసింది. ఈ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం కూడా కీలకమైంది. ఇదిలాఉంటే శనివారం ఇజ్రాయెల్-యూఎస్‌ఏ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్‌పై సైబర్ దాడులు కూడా జరిగాయని జెరూసలెం పోస్ట్ వెల్లడించింది. అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలతోపాటు సెక్యూరిటీ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అధికారిక మీడియా సంస్థల సైట్లు హ్యాక్ అయ్యాయి. దాంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ పడిపోయిందని ఆ మీడియా కథనం. ఇరాన్ ప్రతిదాడుల సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ సైబర్ అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఖమేనీ హత్యపై మౌనమెందుకు? : మోదీ తీరుపై మండిపడ్డ సోనియా, రాహుల్
న్యూదిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు అయాతుల్లా అలీ ఖమేనీ హత్యపై మోదీ ప్రభుత్వం మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మౌనం వహించడం తటస్థంగా లేదని, బదులుగా ఇది పరాజయమని అన్నారు. భారత విదేశాంగ విధాన లక్ష్యము, విశ్వసనీయతపై సందేహం లేవనెత్తుతోందని అన్నారు. బ్జడెట్ సమావేశాల రెండవ భాగం కోసం పార్లమెంట్ తిరిగి సమావేశమైనపుడు, అంతర్జాతీయ వ్యవస్థ విచ్చిన్నంపై ప్రభుత్వ ’ఇబ్బందికరమైన నిశ్శబ్దం’ గురించి బహిరంగంగా మరియు ఎగవేయకుండా చర్చించాలని అన్నారు. జాతీయ డియాలో ప్రచురితమైన తన వ్యాసంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. నైతిక బలాన్ని మనం తిరిగి కనుగొని దానిని స్పష్టత మరియు నిబద్ధతతో వ్యక్తీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల సమయంలో దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్ర చీలికను సూచిస్తుందని అన్నారు. అయితే ఈ ఘటన షాక్‌కు మించి భారత ప్రభుత్వ మౌనం కూడా అంతే దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. భారత ప్రభుత్వం హత్యను లేదా ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించడం మానుకుందని ఆమె పేర్కొన్నారు. అమెరికా- ఇజ్రాయిల్-యుద్ధంపై ప్రధాని మోదీ మౌనం భారత్ ఖ్యాతిని దిగజారుస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచక్రమాన్ని నిర్వచించడానికి ఒక మార్గంగా దేశాధినేత హత్యకు మద్దతు ఇస్తున్నారా లేదా అనే దానిపై ప్రధాని మాట్లాడాలన్నారు. ఇరాన్పై ఏకపక్ష దాడులతోపాటు ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలని ఆయన అన్నారు. అమెరికా-ఇజ్రాయిల్ -ఇరాన్ల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు సున్నితమైన ప్రాంతాన్ని తీవ్ర సంఘర్షణ వైపు నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. చర్చలు, సంయమనం శాంతికి ఏకైక మార్గం అని అన్నారు. భారత దేశం నైతికంగా స్పష్టంగా ఉండాలి. అంతర్జాతీయ చట్టం, మానవుల ప్రాణాలను కాపాడుకోవడంలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యం కలిగి ఉండాలి. మన విదేశాంగ విధానం సార్వభౌమాధికారం వివాదాల శాంతియుత పరిష్కారాన్ని సూచిస్తుంది. అది స్థిరంగా ఉండాలని అన్నారు. మధ్యప్రా చ్యం సంఘర్షణపై ప్రధాని మోదీ మాట్లాడాలని పునరుద్ఘాటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



