Israel cabinet: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ఓకే

– వ్యతిరేకిస్తున్న ఐడీఎఫ్‌

జెరూసలేం, ఆగస్తు 8 : గాజాపై పూర్తిస్థాయి సైనిక ఆక్రమణకు ఇజ్రాయెల్‌ భద్రతా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ నేతలు పది గంటల విస్తృత చర్చల తర్వాత గాజా మొత్తంపై క్రమంగా సైనిక నియంత్రణ సాధించే ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, మొదటి దశలో గాజా నగరంలోని ప్రధాన ప్రాంతాలను ఆక్రమించేందుకు సైన్యం సిద్ధమవుతుంది. తరువాతి దశలో హమాస్‌ ఇజ్రాయెలీ బందీలను ఉంచినట్లుగా భావిస్తున్న గాజా మధ్య భాగాల్లోకి సైన్యం ప్రవేశించనుంది. ఇప్పటివరకు ఆ ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ సైన్యం ప్రణాళికాత్మకంగా దాడులు చేయలేదు. ఈ చర్య ప్రధాన లక్ష్యం 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధాన్ని ప్రారంభించిన హమాస్‌పై సుదీర్ఘ, స్పష్టమైన విజయాన్ని సాధించడం. అయితే, పోరాట ప్రాంతాల వెలుపల ఉన్న సాధారణ పౌరులకు మానవతా సహాయం అందించేందుకు అవకాశం కలిగిస్తున్నట్లు కూడా ఆ ప్రకటన పేర్కొంది. అయితే గాజాను స్వాధీనం చేసుకోవాలన్నది తమ ప్రణాళిక కాదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యూహు వెల్లడిరచారు. హమాస్‌ను నాశనం చేసి బందీలను వెనక్కు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం గాజాలో 75 శాతం భూభాగం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సు(ఐడీఎఫ్‌) నియంత్రణలో ఉంది. తాజా ప్రణాళిక ప్రకారం మిగిలిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోనుంది. అయితే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ప్రతిపాదించిన ఈ అత్యంత ప్రమాదకరమైన యోచనకు ఇజ్రాయెల్‌ సైన్యం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మద్దతివ్వలేదని తెలుస్తోంది. ఈ చర్యతో బందీల ప్రాణాలు ప్రమాదంలో పడతాయనే ఆందోళనను వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *