మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

– పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేశారు
– డీజీపీ శివధర్ రెడ్డి

హైదారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా ముగిసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం.భగవత్‌తో కలిసి ఆయన రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా బుధవారం పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌ను వీక్షిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రంలోని పోలింగ్ స్టేషన్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలిగిందని, ఈ కెమెరాల నిఘా కారణంగాను, పోలీస్ సిబ్బంది బందోబస్తు వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అదుపులో ఉన్నాయన్నారు .ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడంలో పోలీసు సిబ్బంది అంకితభావంతో పాటు ఈ ఆధునిక వెబ్‌కాస్టింగ్ సాంకేతికత ఎంతగానో తోడ్పడిందని ఆయన ప్రశంసించారు. ఈ ఎన్నికల కోసం తెలంగాణ పోలీసులు అత్యంత పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారని డీజీపీ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్లను కవర్ చేస్తూ భారీ ఎత్తున భద్రతను కల్పించామన్నారు. వీటిలో 1,302 అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్), 1,926 సమస్యాత్మక (సెన్సిటివ్) మరియు 4,975 సాధారణ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల తీవ్రతను బట్టి బలగాలను మోహరించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాల నుంచి సుమారు 3,000 మంది అదనపు బలగాలను రప్పించామని, ఇందులో టీజీఎస్పీ, ఫారెస్ట్, ఎక్సైజ్, సీఐడీ మరియు లీగల్ మెట్రాలజీ విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల మరియు అత్యంత సమస్యాత్మక కేంద్రాల వెలుపల వంద శాతం వెబ్‌కాస్టింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత సాధ్యమైందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వృద్ధులు ఓట్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది సహాయం చేశారు . నిజామాబాద్‌లో సిపి  పి. సాయి చైతన్య , నల్గొండ జిల్లా ఎస్పీ  శరత్ చంద్ర పవార్, వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, పెద్దపెల్లి డిసిపి బి రామ్ రెడ్డి వృద్ధ ఓటర్లను , వికలాంగులను వీల్ చైర్ లో పంపించారు .ములుగు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నాలుగో బెటాలియన్ సిబ్బంది మూర్చ వచ్చి పడిపోయిన ఓటరుకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న వృద్ధ ఓటర్లను పోలింగ్ కేంద్రంకు తీసుకువెళ్లి ఓట్లు వేసేలా సహాయపడ్డారు. అదేవిధంగా, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధికి చెందిన రాలకత్వలో వృద్ధులను ఆటోలు తీసుకువెళ్లి ఓట్లు వేసేలా తోడ్పాటు అందించారు. మహబూబాబాద్ జిల్లాలో ఓటర్ల పసిపిల్లలను వారు ఓటేసి వచ్చే వరకు శ్రద్ధగా పోలీస్ సిబ్బంది చూశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *