“ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలు ఉప్పునిప్పుగా ఉంది . నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ సుప్రీంకోర్టు కెళ్లింది. మరో పక్క ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలను పూర్వ పక్షం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ వాదనలను విన్పించుతోంది. వీటన్నింటికీ మించి రెండు రాష్ట్రాల ఇచ్చి పుచ్చుకొనే పరిస్థితి తెలంగాణ వైపు ఏమాత్రం లేదు. అధికార ప్రతి పక్షాల మధ్య రామ రావణ యుద్ధమే సాగుతోంది. చట్ట బద్దత గల రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 87 88 ల్లో నదీ యాజమాన్య బోర్డుల విధులు అధికారాలు స్పష్టంగా పేర్కొన బడి వుంది. రాష్ట్ర విభజన చట్టం మేరకు రాష్ట్రంలోని గోదావరి కృష్ణ నదులపై గల ప్రాజెక్టులు నిర్వహణ నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించాలని కేంద్రం నోటిఫై చేసి చాలా ఏళ్లు అయింది. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు అప్పగింప బడలేదు…”

కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ నియమించిన జల వివాదాల కేంద్ర కమిటీ మరొక మేక చన్నుగా మిగిలి పోక తప్పదు. మరొక మేక చన్ను అని సంబోధించుతు న్నానంటే కారణం లేక పోలేదు. ఈ పాటికే రెండు ఉన్నాయి . పార్లమెంట్ ఆమోదించిన చట్ట బద్దత గల రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నదీ యాజమాన్య రెండు బోర్డులు నేడు నిర్జీవంగా ఉండి పోతున్నపుడు ఇప్పుడు నియమించిన జల వివాదాల కేంద్ర కమిటీ మాత్రం ఏం సాధించుతుంది? ప్రస్తుతం కేంద్ర జల శక్తి శాఖ కమిటీని నియమించుతూ విడుదల చేసిన ప్రకటన సారాంశం పరిశీలించితే నదీ యాజమాన్య బోర్డులు నిర్వర్తించ వలసిన అంశాలు తప్ప కొత్త దనం ఏమాత్రం లేదు. మరి ప్రస్తుతం కొత్త కమిటీ నియమించి ఏమి సాధించదల్చుకున్నారు?
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలు ఉప్పునిప్పుగా ఉంది . నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ సుప్రీంకోర్టు కెళ్లింది. మరో పక్క ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలను పూర్వ పక్షం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ వాదనలను విన్పించుతోంది. వీటన్నింటికీ మించి రెండు రాష్ట్రాల ఇచ్చి పుచ్చుకొనే పరిస్థితి తెలంగాణ వైపు ఏమాత్రం లేదు. అధికార ప్రతి పక్షాల మధ్య రామ రావణ యుద్ధమే సాగుతోంది. చట్ట బద్దత గల రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 87 88 ల్లో నదీ యాజమాన్య బోర్డుల విధులు అధికారాలు స్పష్టంగా పేర్కొన బడి వుంది. రాష్ట్ర విభజన చట్టం మేరకు రాష్ట్రంలోని గోదావరి కృష్ణ నదులపై గల ప్రాజెక్టులు నిర్వహణ నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించాలని కేంద్రం నోటిఫై చేసి చాలా ఏళ్లు అయింది.
ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు అప్పగింప బడలేదు. కేంద్ర ప్రభుత్వం చేతులు ముడుచుకుని ఉండి పోతోంది. తెలంగాణ అప్పజెప్పితే తాము అప్పగించుతామని ఆంధ్ర ప్రదేశ్ చెబుతుంటే తెలంగాణ తద్భిన్నంగా వాదనకు దిగింది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఆంధ్ర ప్రదేశ్ కేవలం 34 టిఎంసిలు తీసుకొనేట్లు కట్టడి చేస్తే తాము ప్రాజెక్టులను స్వాధీనం చేస్తామని తెలంగాణ చెబుతోంది. రేపు ఈ కమిటీ వాదులాటలతో ముగిసే అవకాశం లేకపోలేదు. కాకుంటే టెలీమెట్రీల ఏర్పాటు శ్రీ శైలం జలాశయం మరమ్మతులు గురించి చర్చించ వచ్చు. ఆ మాట కొస్తే టెలీమెట్రీల ఏర్పాటు నదీ యాజమాన్య బోర్డు పరిధిలోనిది. ఆంధ్ర ప్రదేశ్ వైపు నుండి ప్రధానంగా గోదావరి వరద జలాల వినియోగం ప్రస్తావనకు రావచ్చు. తెలంగాణ ప్రతినిధులు ఈ అంశం ఎజెండాకే అంగీకరించక పోవచ్చు. మరి ఏం సాధిస్తారు?
ప్రస్తుతం తరచూ జరిగే యాజమాన్య బోర్డు సమావేశాల్లో ఇరు రాష్ట్రాల ప్రతి నిధులు ఎవరి వాదనలకు వారు కట్టుబడి తమ తమ వాదనలు విన్పించుతున్నారు. యాజమాన్య బోర్డు సమావేశాలకు భిన్నంగా మెరుగ్గా జల వివాదాల కమిటీ సమావేశాలు జరిగే అవకాశం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా కమిటీ ఏర్పడి సాధించేదేమీ ఉండ బోదు. జూలై 16 వ తేదీ జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బనకచర్ల అనుసంధానానికి అనుమతి సంపాదించే భాగంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. విషాదమేమంటే ఈ సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ సమావేశంలో మూగ నోము పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో మాట్లాడారు. కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్ల అనుసంధానం తీవ్రంగా వ్యతిరేకించి సమావేశం ఎజెండాలో లేకుండా జాగ్రత్త పడ్డారు. గమనార్హమైన అంశమేమంటే ఇంత జరుగుతున్నా కేంద్ర మంత్రి మౌనం పాటించారు. అంతిమంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీ ప్రస్తావన తెస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీరించారు. సమావేశం అనంతరం కేంద్ర జల శక్తి శాఖ విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల అనుసంధానం ప్రస్తావన లేదు.
తొలి నుండి కూడా బనకచర్ల అనుసంధానం అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తటస్థత వహిస్తోంది. ఇక్కడే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంచనాలు తప్పాయి. ఆనాటి సమావేశం మినిట్స్ చూస్తే తెలుస్తుంది. సమావేశం కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ముఖ్యమంత్రులు తప్ప కేంద్ర జల శక్తి శాఖ మంత్రి నోరు విప్పలేదు ఇప్పుడు ఏ అంశాలు ఈ కమిటీ పరిశీలించుతుంది? కేంద్ర జల శక్తి శాఖ విడుదల చేసిన ప్రకటనలో కూడా నిర్దిష్టంగా ఏ అంశాలు పేర్కొనలేదు. ఎజెండా కూడా కమిటీ నిర్ణయించుకోవలసి ఉంది . ఆ దశలో ఏకీభావం కుదరకపోవచ్చు. ఒక వేళ కొన్ని అంశాల్లో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ఆంధ్ర ప్రదేశ్ వ్యవహరించినా తెలంగాణ వైపు నుండి స్నేహ హస్తం లభించే అవకాశం లేదు. ఏమాత్రం మొగ్గు చూపినా చంద్రబాబు నాయుడుకు లొంగిపోయాడని తెలంగాణలో బిఆర్ఎస్ నేతలు ఎదురు దాడి మొదలు పెడతారు.
ఇప్పుడు పులి మీద పుట్ర లాగా కేంద్ర జల సంఘం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం డిపిఆర్ ను ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఆమోదించలేమని తిప్పి పంపింది. వాస్తవంలో కూడా అంతే. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీకి ట్రిబ్యునల్ విచారణ జరుపుతుండగా నికర జలాలు లేని ప్రాజెక్టుల డీపీఆర్ లు కేంద్ర జల సంఘం ఎలా ఆమోదించుతుంది? తెలంగాణకు ఈ చర్య పుండుపై కారం రాయడంతో సమానం. జూలై 16 వ తేదీ సమావేశం జరిగిన తరువాత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర కమిటీ నియామకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపలేదు. నెలలు గడచిన తర్వాత గాని పేర్లు పంపలేదు.సూటిగా స్పష్టంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల సమస్యల పరిష్కారానికి నదీ యాజమాన్య బోర్డులుండగా మరో కమీటీ వేయడం కన్నీటి తుడుపే.





