కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చార‌మే సింగిల్ పాయింట్ అజెండానా?

– అంచ‌నాలు పెర‌గ‌కుండా మీరు పూర్తి చేసిన ప్రాజెక్టు ఏదైనా ఉన్న‌దా?
– అంచ‌నా వ్య‌యం పెర‌గ‌డానికి త‌గిన కార‌ణాలున్నాయి
– అవ‌గాహ‌న‌లేకుండా విమ‌ర్శించ‌వద్దు
– కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు ఫైర్‌

 కాళేశ్వరం ప్రాజెక్టు పై దుష్ప్రచారం చేయడమే రేవంత్, ఉత్తమ్ లకు సింగిల్ పాయింట్ ఎజెండా గా మారింద‌ని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.
ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను, పంప్ హౌజ్ అను వాడుకుంటూనే మరోవైపు దాన్ని తెల్ల ఏనుగు  అనడం స‌మంజ‌సం కాద‌ని హిత‌వు ప‌లికారు. ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు, మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారు. ఆవిధంగా వీరిద్ద‌రూ తెలంగాణ పాలిట తెల్ల ఏనుగులుగా మారార‌ని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర నుంచి కాళేశ్వరం మీద కుట్రలు చేయడం తప్ప, ఎక్కడా ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేద‌న్నారు.  తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం కమిషన్ల కోసమే అని అదే పనిగా ప్ర‌చారం చేస్తున్నారు స‌రే, తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని 2015  ఫిబ్రవరి 18,  మార్చి4 తేదీల్లో సిడబ్లుసీ రాసిన లేఖల్లో పేర్కొన్న మాట వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు.
ఏడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అనుమతులు సాధించలేదు? తుమ్మిడిహట్టి వద్ద చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్న మాట వాస్తవం కాదా? తమ్మిడిహెట్టి వద్ద మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి వ్యర్థమే అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన మాట వాస్తవం కాదా?  ఏడేళ్లు మహారాష్ట్ర, ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు సాధించలేదు, తట్టెడు మట్టి తీయలేదు, ఒక్క ఇటుక పేర్చలేదనేది దాచేస్తే దాగని సత్యమ‌ని పేర్కొన్నారు.
 తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 2328 కోట్లు స్వాహా చేసిన మీరా అవినీతి గురించి మాట్లాడేద‌ని ప్ర‌శ్నించారు. ప్రజాధనం వృథా కావొద్దనే ఉద్దేశ్యంతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే విధానాన్ని రద్దు చేసిన చరిత్ర బిఆర్ఎస్ ద‌ని గుర్తు చేశారు.  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 2007లో రూ.17,875 కోట్లకు జీవో ఇచ్చి, 19నెలల్లోనే ఏ పని చేయకుండానే రూ. 38,500 కోట్లకు పెంచారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పుడు 40,300 కోట్లకు పెంచారు. ఏ పని చేయకుండానే అంచనాలు ఎలా పెరిగాయ‌ని ప్ర‌శ్నించారు. నాలుగేండ్లలో పూర్తి చేస్తామని చెప్పి, తట్టెడు మట్టి తీయకుండానే పదేండ్లలో సర్వే, మొబిలైజేషన్ పేరిట రూ. 2328 కోట్లు దండుకున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమేనుంటూ విమ‌ర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఏడేండ్లలో రూ. 10వేల కోట్లు ఖర్చు చేసినం అని చెప్పడం శుద్ద అబద్దం, భూసేకరణ, ఇతర అన్ని పనులకు మీరు చేసిన ఖర్చు కేవలం రూ.3780 కోట్లు.
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉన్నది నిజమే అయితే, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే సోయి నిజంగానే ఉంటే, పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదు, అనుమతులు ఎందుకు సాధించలేదు? బ్యారెజీ ఎందుకు కట్టలేదు, గ్రావిటి కెనాల్ ను ఎందుకు ఎల్లంపల్లి వరకు తవ్వలేదు.మీరు ఆ రెండు పనులు చేస్తే, ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాద‌న్నారు.  మీరు చేసిన తప్పులు సరిదిద్దేందుకు, చేసిన ఖర్చు వృథా కాకుండా ఉండేందుకు ప్రాణహిత ప్రాజెక్టుకు రీ డిజైనింగ్ చేసి, కాళేశ్వరం నిర్మించామ‌న్నారు.  ఆనాడు కమిషన్లు దండుకొని, జేబులు నింపుకున్న చ‌రిత్ర మీది. దీనిపై కాగ్ మొట్ట‌కాయ‌లు ఇవ్వ‌డం వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు.  ఇప్పుడు కూడా., తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా, ఎందుకు తట్టెడు మట్టి తీయలేదో చెప్పాలని ఉత్తం, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *