అంతమా?.. ఆరంభమా??

– ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరుకుందా?
– హసేవ్ సెగలు.. కార్పొరేట్ నీడల మాటున నిప్పు రాజుకుంటుందా?
– కొత్త పంథాలో పోరాటానికి ఊపిరి పోస్తారా?
– అమిత్ షా ‘మావోయిస్టు ముక్త్ భారత్’ ప్రకటన నేపథ్యంలో ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం
                (మేకల ఎల్లయ్య, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

భారతదేశ అంతర్గత రాజకీయ ముఖచిత్రంలో గత ఐదు దశాబ్దాలుగా మావోయిజం ఒక ప్ర ధాన సవాలుగా నిలుస్తూ వచ్చింది. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా తుడిచివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించి, సైన్యంతో దాడులు పెం చిన నేపథ్యంలో, ఈ సాయుధ పోరాటం ఒక
నిర్ణయాత్మక దశకు చేరుకుంది. భారతదేశం లో మావోయిస్ట్ ఉద్యమం, నక్సలిజం మూలా లు పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీ అనే చిన్న గ్రామంలో 1967లో జరిగిన రైతాంగ తిరుగు బాటులో ఉన్నాయి. చారు మజుందార్, కానూ సన్యాల్. జంగల్ సంతాల్ వంటి నాయకుల నేతృత్వంలో సాగిన ఈ పోరాటం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రారంభమైంది. మావో జెడాంగ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ, భారత రాజ్యాం గాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను సాయుధ బ లంతో కూలదోసి, “పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడ రేటివ్ రిపబ్లిక్”ను స్థాపించాలనేది వీరి ప్రధాన ఉద్దేశం.

ప్రారంభ దశ, విచ్ఛిన్నం(1967-2004)

1969లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ఏర్పడిన తర్వాత, ఉద్యమం దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. అయితే, 1970లలో ప్రభుత్వం చేపట్టిన కఠినమైన చర్యలు, చారు మజుందార్ మరణం తర్వాత ఈ ఉద్యమం అనేక వర్గాలుగా విడిపోయింది. ఈ కాలంలో సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ), మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) వంటి రెండు ప్రధాన సంస్థలు వేర్వేరుగా తమ కార్యకలాపాలను సాగించాయి. కొండపల్లి సీతారామయ్య 1980లో ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్ వార్ గ్రూప్‌ను స్థాపించగా, బీహార్, జార్ఖండ్ ప్రాంతాలలో ఎంసీసీఐ బలంగా విస్తరించింది. మావోయిస్ట్ ఉద్యమ చరిత్రలో 2004 సెప్టెంబర్ 21 అత్యంత కీలకమైన రోజు. సిద్ధాంతపరమైన భేదాలను పక్కనబెట్టి, పీపుల్స్ వార్ గ్రూప్ ఎంసీసీఐ విలీనమై ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)’గా అవతరించాయి. ఈ విలీనం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే కమాండ్ కింద పనిచేసే శక్తివంతమైన సాయుధ బలగం ఏర్పడింది. వీరి సాయుధ విభాగమైన ‘పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ’ (పీఎల్ జీఏ) సుమారు 6,500 మంది సాయుధ క్యాడర్‌తో, అధునాతన ఆయుధాలతో ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ దశలో నేపాల్ సరిహద్దు నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఒక “రెడ్ కారిడార్” ఏర్పరచాలనే లక్ష్యంతో వారు పనిచేయడం ప్రారంభించారు.
‘సమాధాన్’ సిద్ధాంతంతో అంతంచేసే ప్లాన్
2004 నుంచి 2010 వరకు మావోయిస్ట్ హింస గరిష్ట స్థాయికి చేరుకుంది. 2010లో ఒక్క ఏడాదే 1,005 మంది మరణించగా, అందులో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు దంతెవాడ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నక్సలిజాన్ని దేశ అంతర్గత భద్రతకు అత్యంత పెద్ద ముప్పుగా అభివర్ణించారు. అయితే, 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చి, ‘సమాధాన్’ అనే ఎనిమిది సూత్రాల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. ఎస్ (స్మార్ట్ లీడ‌ర్‌షిప్‌) : సమర్థవంతమైన నాయకత్వం ద్వారా కార్యకలాపాలను సమన్వయం చేయడం. ఎ (అగ్రెసివ్ స్ట్రాటిజీ) : రక్షణ శ్రేణుల నుంచి దాడి చేసే శ్రేణులకు మారడం. ఎం (మోటివేష‌న్ అండ్ ట్రైనింగ్‌) : భద్రతా బలగాలకు ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహం అందించడం. ఎ (అకౌంట‌బుల్ ఇంటెలిజెన్స్) : ఖచ్చితమైన సమాచారంతో దాడులు నిర్వహించడం. డి. (డ్యాష్ బోర్డ్ బేస్డ్ కేపీఐలు) : పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం. హెచ్ (హార్నెసింగ్ టెక్నాల‌జీ) : డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్, అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీ వాడకం. ఈ వ్యూహం కింద కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా, మావోయిస్టులకు అందే నిధులను అడ్డుకోవడం, వారి సిద్ధాంత ప్రచారాన్ని దెబ్బతీయడం వంటి చర్యలు కూడా చేర్చారు. గత దశాబ్ద కాలంలో మావోయిజం భౌగోళికంగా, సంఖ్యాపరంగా ఎలా క్షీణించిందో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2010లో గరిష్టంగా ఉన్న హింసాత్మక ఘటనలు 2025 నాటికి 88 శాతం తగ్గాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో ప్రాణనష్టం వివరాలను పరిశీలిస్తే, భద్రతా బలగాల పైచేయి స్పష్టంగా కనిపిస్తుంది. 2010 లో 481 హింసాత్మక సంఘటనలు జరగగా, 1,180 మంది చనిపోయారు. అందులో  మావోయిస్టులు 265, భద్రతా బలగాలు 267, సాధారణ పౌరులు 630 మంది ఉన్నారు. 2024లో 161 హింసాత్మక సంఘటనలు జరగగా, 397 మంది మరణించారు. అందులో మావోయిస్టులు 296, భద్ర‌తా బలగాలు 21, సాధారణ పౌరులు 80 మంది ఉన్నారు. 2025లో 141 హింసాత్మక సంఘటనలు జరగగా, 477 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 390 మావోయిస్టులు, 33 మంది భద్రతా బలగాలు, 54 మంది సాధారణ పౌరులు చనిపోయారు. 2026 (మార్చి 22 వరకు) జరిగిన 8 హింసాత్మక సంఘటనల దాడుల్లో 65 మంది మరణించగా, అందులో 62 మంది మావోయిస్టులు ఉన్నారు. భద్రతా బలగాలు ఒకరు మరణించగా, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2026లో మరణించిన వారిలో 95 శాతానికి పైగా మావోయిస్టులే ఉండడం, భద్రతా బలగాల ఖచ్చితత్వాన్ని (కిల్ రేషియో) సూచిస్తుంది. 2010లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య మరణాల నిష్పత్తి 1.01:1 గా ఉండగా, 2026 నాటికి అది 1:62 కి మెరుగుపడింది. మావోయిస్ట్ క్యాడర్ మానవ వనరుల సంక్షోభంలో కూరుకుపోయిందని తాజా సమాచారం వెల్లడిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 7,400 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా, 5,880 మంది లొంగిపోయారు. ముఖ్యంగా 2025 సంవత్సరంలో లొంగుబాట్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 2025లో 1,573 మంది క్యాడర్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆకర్షణీయమైన పునరావాస పథకాలు (రీహాబిలిటేషన్ పాలసీ 2025) ఈ మార్పుకు ప్రధాన కారణం. లొంగిపోయిన వారికి నగదు ప్రోత్సాహకాలు, గృహ వసతి, విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడంతో, అడవిలో కష్టతరమైన జీవితం గడుపుతున్న క్యాడర్ బయటకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. బస్తర్ ప్రాంతంలో “పూనా మార్గెమ్” (కొత్త దారి) వంటి కార్యక్రమాలు మావోయిస్టుల ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించాయి.

‘రెడ్ కారిడార్’ అంతం

ఒకప్పుడు దేశంలోని 180కి పైగా జిల్లాల్లో విస్తరించి ఉన్న నక్సల్స్ ప్రభావం, నేడు కేవలం కొన్ని పాకెట్లకే పరిమితమైంది. 2014లో 126 జిల్లాలు ప్రభావితం కాగా, 2026 మార్చి నాటికి ఆ సంఖ్య కేవలం 7 జిల్లాలకు పడిపోయింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2026 నాటికి బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, కాంకేర్, దంతెవాడ జిల్లాలు అత్యంత ప్రభావిత జిల్లాలుగా ఉండగా,  ప్రస్తుతం అబూజ్‌మడ్ అడవులు ఇప్పటికీ ప్రధాన యుద్ధభూమిగా ఉన్నాయి. జార్ఖండ్ లో పశ్చిమ సింగ్‌భూమ్ అత్యంత ప్రభావితంగా ఉండగా, ప్రస్తుతం సరాండా అడవుల్లో మిసిర్ బెస్రా కదలికల కోసం గాలింపు చేస్తున్నారు. ఒడిశాలో  కంధమాల్ అత్యంత ప్రభావితంగా ఉండగా, ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల ప్రాబల్యం దాదాపు శూన్యంగా మారింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో మావోయిస్టుల ఉనికి దాదాపు కనుమరుగైంది. తెలంగాణలో 2026 మార్చిలో జరిగిన భారీ లొంగుబాటుతో “తెలంగాణ స్టేట్ కమిటీ” పూర్తిగా రద్దయిందని పోలీసులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి కొన్ని ప్రాంతాలలో నామమాత్రపు కదలికలు మాత్రమే ఉన్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 17,217 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా, 20,073 మంది లొంగిపోయారు. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించి ఉన్న ప్రభావం, 2026 మార్చి నాటికి కేవలం 7 జిల్లాలకు పడిపోయింది.

పార్టీ అగ్రశ్రేణి విధ్వంసం

మావోయిస్ట్ పార్టీ వెన్నెముక వంటి సెంట్రల్ కమిటీ,  పొలిట్‌బ్యూరో సభ్యులు వరుసగా మరణించడం,  లొంగిపోవడం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. 2004లో 42 మంది సభ్యులతో ఉన్న సెంట్రల్ కమిటీ, 2025 నాటికి కేవలం 13 మందికే పరిమితమైంది. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నంబాల కేశవరావు (బసవరాజు) 2025 మే నెలలో అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్”లో మరణించాడు. దంతెవాడ దాడి సూత్రధారి, అత్యంత ప్రమాదకరమైన కమాండర్ అయిన మడావి హిడ్మా, 2025 నవంబర్‌లో ఆంధ్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. బసవరాజు తర్వాత జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తిప్పిరి తిరుపతి (దేవుజీ) 2026 ఫిబ్రవరిలో అనారోగ్యం, ఒత్తిడి కారణంగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. అగ్రశ్రేణి పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (సోను) 2025 అక్టోబర్‌లో లొంగిపోయాడు. బస్తర్ ప్రాంతంలో చివరి బలమైన నాయకుడిగా పరిగణించబడిన పాపారావు 2026 మార్చి 24న లొంగిపోయాడు. ప్రస్తుతం పార్టీలో అత్యున్నత స్థాయి నాయకులుగా మిసిర్ బెస్రా, ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) మాత్రమే మిగిలి ఉన్నారు. ఆయన కూడా లొంగిపోవడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. సుమారు 76 ఏండ్ల వయసున్న గణపతి, గత రెండేండ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో (ఆస్తమా, మధుమేహం) నేపాల్‌లో తలదాచుకున్నట్టు సమాచారం. తాజాగా అందుతున్న రిపోర్టుల ప్రకారం, ఆయన ఢిల్లీకి చేరుకున్నారని, అక్కడ కేంద్ర నిఘా వర్గాల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలోనే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉందని, దీని కోసం ఆయన సోదరుడు కూడా బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. గణపతిపై రూ.1 కోటి నుంచి రూ.2.5 కోట్ల వరకు రివార్డు ఉంది. నాయకత్వ లేమి కారణంగా పార్టీ క్యాడర్‌లో దిశానిర్దేశం కరువైంది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న మావోయిస్ట్ సాయుధ దళం (పీఎల్ జీఏ) నేడు వందల్లోకి పడిపోయింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, 2024లో 2,000 పైగా ఉన్న సాయుధ క్యాడర్ సంఖ్య, 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా కేవలం 220 నుంచి 350 మధ్య మాత్రమే ఉండవచ్చు. వీరిలో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్-జార్ఖండ్ సరిహద్దు ప్రాంతాలలోని లోతైన అడవుల్లో తలదాచుకుంటున్నారు. ఆయుధాల పరంగా కూడా వారు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నారు. గత రెండేండ్లలో భద్రతా బలగాలు 645 కంటే ఎక్కువ ఆధునిక ఆయుధాలను, 875 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. ఇది మావోయిస్టుల సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమైందని సూచిస్తుంది. పార్టీ తన అంతర్గత సర్క్యులర్లలో “తీవ్రమైన మానవ వనరుల సంక్షోభాన్ని” ఒప్పుకోవడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2000 మార్చి నుంచి 2026 మార్చి 22 వరకు దేశవ్యాప్తంగా సుమారు 17,217 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. కేవలం 2019 నుంచి ఇప్పటి వరకు 7,311 మంది మావోయిస్ట్ క్యాడర్ అరెస్టయ్యారు. 2024లో 1,090 మందిని, 2025లో 862 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించి ఉన్న మావోయిజం, 2026 మార్చి నాటికి కేవలం 7 జిల్లాలకే (ఛత్తీస్‌గఢ్‌లో 5, జార్ఖండ్‌లో 1, ఒడిశాలో 1) పరిమితమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 130 నుంచి 150 మంది మాత్రమే సాయుధ కేడర్ మిగిలి ఉన్నట్టు అంచనా.

మావోయిస్టుల కోటల్లో మౌలిక సదుపాయాలు

మావోయిస్టులు ఏ ప్రాంతాలనైతే దశాబ్దాలుగా తమ పట్టులో ఉంచుకున్నారో, అక్కడ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టింది. మౌలిక సదుపాయాల కల్పనే మావోయిజంపై అంతిమ విజయం సాధించడానికి మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. 2014-2025 మధ్య 12,000 కిలోమీటర్ల పైగా రోడ్ల నిర్మాణం చేసింది. దీంతో భద్రతా బలగాల కదలిక సులభతరమైంది. మార్కెట్లకు అనుసంధానం పెరిగింది. 9,233 టెలికాం టవర్ల ఏర్పాటుతో సమాచార వ్యవస్థ మెరుగుపడింది.  డిజిటల్ విద్య పెరిగింది. 1,804 బ్యాంక్ బ్రాంచీలు, 5,899 పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేయడంతో ఆర్థిక సమ్మిళితం పెరిగింది. సంక్షేమ పథకాల అమలు కోసం నేరుగా నగదు బదిలీ జరిగింది. 179 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడంతో గిరిజన యువతకు ఆధునిక విద్య అందింది. వారు మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు కాకుండా కొంతవరకు నిరోధకంగా మారింది. “నియద్ నెల్లనార్” (మీ గ్రామ అభివృద్ధి) వంటి పథకాల ద్వారా బస్తర్ ప్రాంతంలోని 90 మారుమూల గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన 361 కొత్త క్యాంపులు ఇప్పుడు కేవలం పోలీస్ స్టేషన్లుగానే కాకుండా, ఆరోగ్య కేంద్రాలుగా, రేషన్ పంపిణీ కేంద్రాలుగా మారుతున్నాయి.

మావోయిజం నిజంగానే అంతమవుతుందా?

2026 మార్చి 31 గడువు సమీపించిన వేళ, మావోయిజం పూర్తిగా కనుమరుగవుతుందా అన్న అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. కేవలం తుపాకీ పట్టిన వారిని చంపడం వల్ల సిద్ధాంతం అంతమవుతుందా అన్నది సామాజిక శాస్త్రవేత్తల ప్రశ్న.  గిరిజనుల భూమి, అడవి హక్కుల విషయంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడల్లా మావోయిజం మళ్లీ  పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని “హస్దేవ్ అరణ్య” అడవులలో జరుగుతున్న బొగ్గు గనుల తవ్వకాలు, భారీ చెట్ల నరికివేత గిరిజనులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అదానీ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థలకు గనులను కట్టబెట్టడం కోసం గ్రామ సభల అనుమతులను నకిలీ పద్ధతుల్లో సృష్టించారని ఆరోపణలు వస్తున్నాయి. పెసా చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కడం వల్ల గిరిజనులు తమ మనుగడ కోల్పోతామని భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు మావోయిస్టులకు మళ్లీ క్యాడర్‌ను సమీకరించుకోవడానికి ఆయుధాలుగా మారే ప్రమాదం ఉంది. “ఆపరేషన్ కగార్” వంటి భారీ భద్రతా చర్యల సమయంలో పౌరులు కూడా బలవుతున్నారని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 2024-25లో జరిగిన కొన్ని ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారు సాధారణ గిరిజనులని, వారిని మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారని పీయూడీఆర్ వంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. భద్రతా బలగాలు ఏర్పాటు చేస్తున్న అధిక సంఖ్యలో పోలీస్ క్యాంపులు ఆ ప్రాంతాన్ని మిలిటరైజ్ చేస్తున్నాయని, గిరిజనుల స్వేచ్ఛను హరిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఒకవేళ నిర్దోషులైన గిరిజనులు ఎన్‌కౌంటర్లలో మరణిస్తే, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన అసంతృప్తిని పెంచుతుంది. ఇది మావోయిజం మళ్లీ తలెత్తడానికి దోహదం చేస్తుంది.

సిద్ధాంతపరమైన మార్పులు,  డిజిటల్ మావోయిజం

సాయుధ పోరాటం బలహీనపడినప్పటికీ, మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలలో మేధావులు, విద్యార్థుల ద్వారా తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనినే “అర్బన్ నక్సలిజం” అని పిలుస్తున్నారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, డార్క్ వెబ్ వంటి ఆధునిక సాంకేతికతలను వాడుకుంటూ యువతను రాడికలైజ్ చేసే ముప్పు పొంచి ఉంది. అమిత్ షా ప్రకటించిన 2026 మార్చి 31 గడువు అనేది సాయుధ మావోయిజం వ్యవస్థీకృత రూపాన్ని అంతం చేయడానికి ఒక గమ్యస్థానంగా నిలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ తన మునుపటి శక్తిని తిరిగి సంపాదించుకోవడం అసాధ్యమని స్పష్టమవుతోంది. నాయకత్వ శూన్యత, క్యాడర్ కొరత, భౌగోళిక పరిమితులు వారిని చివరి దశకు చేర్చాయి. అయితే, మావోయిజం శాశ్వతంగా అంతం కావాలంటే కేవలం తుపాకులను నిశ్శబ్దం చేస్తే సరిపోదు. గిరిజన ప్రాంతాలలో “భద్రత” నుంచి “సేవ” వైపు పాలన మారాలి. గిరిజనుల అటవీ హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలి. గనుల కేటాయింపులో గ్రామ సభల నిర్ణయానికే ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్లు, భవనాలే కాకుండా, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మారుమూల గిరిజనులకు అందేలా చూడాలి. లొంగిపోయిన వేలాది మంది మావోయిస్టులు మళ్లీ నేరాల బాట పట్టకుండా వారిని సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చేయాలి. భద్రతా చర్యల సమయంలో అమాయక గిరిజనులు హింసకు గురికాకుండా చూడడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పెంచాలి. 2026 మార్చి 31 తర్వాత భారతదేశం సాయుధ మావోయిజం నుంచి విముక్తి పొందే అవకాశం ఉన్నప్పటికీ, ఆ శాంతిని శాశ్వతం చేయడం అనేది ప్రభుత్వం గిరిజన ప్రాంతాలలో ఎంత సమర్థవంతంగా,  మానవీయంగా పాలనను అందిస్తుంది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. దేశంలో సామాజిక-ఆర్థిక సమస్యలు పరిష్కారం కానంత వరకు సిద్ధాంతపరమైన సవాళ్లు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 సామాజిక-రాజకీయ పోరాటాల వైపు..

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పాలనలో అవలంబిస్తున్న కొన్ని విధానాలు మావోయిస్టులకు తమ సిద్ధాంతాన్ని పునరుద్ధరించుకోవడానికి అవకాశాలను కల్పిస్తున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలోనే భారతదేశంలో దళితులపై 113 కుల వివక్ష దాడులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం “ప్రో-హిందుత్వ” మోడల్‌లో పనిచేస్తూ మైనారిటీలు, దళితులు, గిరిజనులను అంచులకు నెట్టివేస్తోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా “శ్రమ శక్తి నీతి 2025” వంటి ముసాయిదా చట్టాలు మనుస్మృతి ఆధారిత కుల క్రమానుగత శ్రమ విభజనను ప్రోత్సహిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. మావోయిస్టులు ఈ సామాజిక అశాంతిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ తన అంతర్గత ప్రచారంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని “బ్రాహ్మణీయ హిందూ-ఫాసిస్ట్ శక్తులు” గా అభివర్ణిస్తోంది. సామాజిక కార్యకర్తల అరెస్టులు, భీమా-కోరేగావ్ వంటి కేసులను ఉదాహరణగా చూపుతూ మేధావులను, యువతను తమవైపు తిప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే, గడిచిన కాలంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, సీఏఏ-ఎన్ఆర్ సీ నిరసనలు, దళిత ఉద్యమాలను తమ సాయుధ పోరాటంతో సమన్వయం చేయడంలో విఫలమయ్యామని పార్టీ పొలిట్‌బ్యూరో (సర్క్యులర్ 1/2024) అంగీకరించింది. అడవుల్లో పట్టు కోల్పోతున్న తరుణంలో, మావోయిస్టులు తమ పోరాట పంథాను నగరాలకు మారుస్తున్నారు. దీనినే “అర్బన్ యునైటెడ్ ఫ్రంట్” నమూనా అని పిలుస్తారు. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, సాంస్కృతిక వేదికల ద్వారా తమ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మానవ హక్కుల సంఘాలు, న్యాయ సహాయ బృందాల ముసుగులో ప్రభుత్వ భద్రతా చర్యలను అడ్డుకోవడం, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, డార్క్ వెబ్, సోషల్ మీడియా విశ్లేషణల ద్వారా పట్టణ యువతను ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని “హస్దేవ్ అరణ్య” అడవులలో జరుగుతున్న బొగ్గు గనుల తవ్వకాలు, అదానీ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థల ప్రమేయం గిరిజనులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. పెసా, అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి, నకిలీ అనుమతులతో అటవీ భూములను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గనుల తవ్వకం వల్ల లక్షలాది చెట్ల నరికివేత, గిరిజన గ్రామాల తరలింపు వారి మనుగడకే ముప్పుగా మారింది. భద్రతా బలగాల శిబిరాలను కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఇది “ఆపరేషన్ కగార్” వంటి చర్యలపై అనుమానాలను పెంచుతోందని హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టులు ఈ కార్పొరేట్-ప్రభుత్వ నెక్షస్‌ను ప్రధాన ఎజెండాగా మార్చుకొని, తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టులు తమ వ్యూహాన్ని సాయుధ పోరాటం నుంచి సామాజిక-రాజకీయ పోరాటాల వైపు (పొలిటికల్ మూవ్ మెంట్) మళ్లించే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *