గోదావరి కావేరి అనుసంధానం సాధ్యమా?

బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లపై ఒత్తిడి!

ఏ నదీ లోయ లోనైనా భాగస్వామ్య రాష్ట్రాల అవసరాలు పూర్తిగా తీరిన తరువాత మిగులు నీళ్లు వుంటే మరో నదీ లోయకు తరలించాలనేది సహజ న్యాయ సూత్రం. కాని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇందుకు తద్విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమిళ నాడు కేరళ రాష్ట్రాల్లో రాజకీయంగా పాగా వేసేందుకు చేయని ప్రయత్నం లేదు. వచ్చే సంవత్సరం తమిళ నాడులో ఎన్నికలు జరుగనున్నందున దక్షిణాది రాష్ట్రాల్లో కంటిలో నలుసుగా తయారైన డిఎంకె ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు తాజాగా అన్నాడియంకె తో జట్టు కట్టింది. పైగా అన్నాడియంకె అగ్ర నేత అభిప్రాయం మేరకు తమిళ నాడు లో ఇంత వరకు బీజేపీకి  జవ సత్వాలు కల్పించిన అన్నామలైను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పీఠం నుండి హఠాత్తుగా తప్పించింది. తాజాగా గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు గోదావరి కావేరి అనుసంధానం ఇటీవలగా మరుగు పడి వుండగా తిరిగి తెర మీదకు తెచ్చింది. మరీ దుర్మార్గమేమంటే కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో గల కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు నీళ్లు లేవని తేల్చిన తర్వాత కూడా ఈ ప్రయత్నాలను మానుకోలేదు.

ప్రధానంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎవరి వాటా ఎంతో తేల లేదు. అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ గోదావరి నదిపై పలు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ పూర్తిగా నిర్మాణం జరిగితే గాని రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలు ఎంతో తేలదు. గత అయిదారేళ్లుగా గోదావరి కావేరి అనుసంధానం అమలు గురించి కేంద్రం ప్రభుత్వం చేసిన జిమ్మిక్కులు ఎత్తుగడలను వాస్తవం చెప్పాలంటే కెసిఆర్ నిక్కచ్చిగా ఎదుర్కోబట్టి కేంద్ర ప్రభుత్వం ఆటలు సాగలేదు. కెసిఆర్ విధానాలతో ఏకీభవించని వారు కూడా ఆయనను ఈ అంశంలో మెచ్చుకోక తప్పదు. లేకుంటే ఈ పాటికే గోదావరి కావేరి అనుసంధానం అమలుకు వచ్చేది. తమ రాష్ట్రంలో నిర్మాణం వున్న ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు కేటాయించి మిగులు వుంటే తరలించుకు పోవచ్చని కెసిఆర్ మొండిగా కూర్చున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కెసిఆర్ లాగా మొండిగా కూర్చోకున్నా తమ వాటా ఎంతో తేల్చి ఈ పథకం అమలు చేయమని చెబుతూనే మరో పక్క పోలవరం ప్రాజెక్టు నుండి కావేరి అనుసంధానం చేపట్ఠమనే ప్రతి పాదన చేసింది.

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం మెత్త బడ లేదు. ఒక వేళ తప్పదనుకొంటే సమ్మక్క బ్యారేజీ వద్ద నుండి నీళ్లు తీసుకొంటూ మార్గ మధ్యలో నల్లగొండ జిల్లాలో రెండు రిజర్వాయర్ లు నిర్మించాలని కోరారు. ఇవన్నీ ఏదో ఒక రూపంలో అమలు చేయవచ్చు గాని తరలించే నీటి లో యాభై శాతం ఇవ్వాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చిన తర్వాతనే సాగర్ ఆన్ లైన్ రిజర్వాయర్ చేయాలని వాస్తవంలో ఇప్పట్లో అమలు చేయలేని కఠిన షరతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పాదించింది. ఈ షరతులు పూర్తి చేయడం కేంద్రానికి తలకు మించిన భారం.

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం మెత్త బడ లేదు. ఒక వేళ తప్పదనుకొంటే సమ్మక్క బ్యారేజీ వద్ద నుండి నీళ్లు తీసుకొంటూ మార్గ మధ్యలో నల్లగొండ జిల్లాలో రెండు రిజర్వాయర్ లు నిర్మించాలని కోరారు. ఇవన్నీ ఏదో ఒక రూపంలో అమలు చేయవచ్చు గాని తరలించే నీటి లో యాభై శాతం ఇవ్వాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చిన తర్వాతనే సాగర్ ఆన్ లైన్ రిజర్వాయర్ చేయాలని వాస్తవంలో ఇప్పట్లో అమలు చేయలేని కఠిన షరతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పాదించింది. ఈ షరతులు పూర్తి చేయడం కేంద్రానికి తలకు మించిన భారం.

1989 సంవత్సరంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తొమ్మిది అనుసంధానాలను ప్రతిపాదించినది. అందులో తొలి అనుసంధానం మహానది గోదావరి, 2)గోదావరి (పోలవరం) కృష్ణ (విజయవాడ), 3) గోదావరి (ఇచ్చంపల్లి) – కృష్ణ (నాగార్జున సాగర్), 4)గోదావరి (ఇచ్చంపల్లి) – కృష్ణ (పులిచింతల), 5) కృష్ణ (ఆల్మట్టి) – పెన్నార్, 6)కృష్ణ (శ్రీ శైలం) – పెన్నార్, 7)కృష్ణ (సాగర్) -పెన్నార్(సోమశిల),8)పెన్నార్ (సోమశిల) – కావేరి, 9)కావేరి నుండి వైగయ్, గుండర్. ఇవి తొమ్మిది అనుసంధానాలు. అయితే ఇవన్నీ పక్కన బెట్టి ఇచ్చంపల్లి లేక సమ్మక్క (తుపాకులు గూడెం) నుండి సాగర్ మీదుగా సోమశిల తర్వాత కావేరికి గోదావరి జలాలు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం తలపోస్తోంది.

మహానది-గోదావరి మొదటిది. అయితే అప్పట్లో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మహానది గోదావరి అనుసంధానానికి అంగీకరించ లేదు. జాతీయ జల అభివృద్ధి సంస్థ అంచనా వేసిన మేరకు మహానదిలో నీళ్లు లేవని మొండికేశారు. అడ్డం తిరిగిన నవీన్ పట్నాయక్ ముందు ప్రధాని మోడీ ఏమీ చేయ లేక పోయారు. అదే సమయంలో కెసిఆర్ కూడా ముందుగా మహానది గోదావరి అనుసంధానం అమలు జరిపితే గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించుతానని షరతు విధించిన సందర్భాలున్నాయి. ఇవన్నీ ఆచరణకు అడ్డంకిగా తయారు కావడంతో గత ఆరేళ్లుగా ఈ ప్రతిపాదన అటకెక్కింది. అయితే కేంద్ర జల సంఘం గోదావరిలో నికర జలాలు మిగిలి లేవని తేల్చినందున ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఇంకా తన వాటా ఉపయోగించుకోనందున దాని వాటా 148 టియంసిలకు స్పాట్ పెట్టారు. ఆ మధ్య వరకు ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వున్నందున అదీ అంగీకరించ లేదు. కొసమెరుపు ఏమంటే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం వున్నా తన వాటా ఇచ్చేందుకు ఆ మధ్య వరకు ససేమిరా అనింది. తాజాగా ఛత్తీస్ ఘడ్ కు ఏం మంత్రం వేసేరో తెలియదు గానీ ఇంత వరకు దస్త్రాలకే పరిమితమైన గోదావరి కావేరి అనుసంధానాన్ని బయటికి తీసింది.

కాగా మరో విపత్తు ఎదురౌబోతోంది. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి బనకచర్ల అనుసంధానం తెర మీదకు తెచ్చారు. ఈ సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం సైలెంట్ వున్నందున అందరు కూడా కేంద్ర ప్రభుత్వం విరమించుకొన్నదనే అభిప్రాయ పడ్డారు. కాని అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం తిరిగి గోదావరి కావేరి అనుసంధానాన్ని తెర మీదకు తెచ్చి ఇది వరలో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు జూన్ 24 వతేదీ హైదరాబాద్ సమావేశం నిర్వహించ దలచినట్లు ప్రకటన వెలువడింది. ఈ దెబ్బతో గోదావరి బనకచర్ల అనుసంధానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ తను చేపట్టనున్న గోదావరి బనకచర్ల అనుసంధానంలో భాగమైన బొల్లాపల్లి నుండి కావేరి అనుసంధానం చేపట్టమని ప్రతి పాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ ప్రతిపాదన తిరస్కరింప బడి వుంది. మరి జూన్ 24 తేదీ హైదరాబాద్ లో జరుగ నున్న సమావేశంలో ఏదో ఒక స్వరూపం రావచ్చు.

గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన షరతులు వైతరణి నదిలాగా అడ్డుపడే అవకాశం ఉంది. తెలంగాణలో ఏదో ఒక చోట నుండి గోదావరి కావేరి అనుసంధానం చేపడితేఆంధ్ర ప్రదేశ్ చేపట్టనున్న గోదావరి బనకచర్ల అనుసంధానం రెండూ ఏక కాలంలో జరగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఎత్తుగడ వేస్తారో వేచి చూడాల్సిందే!

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు
వి. శంకరయ్య,
 విశ్రాంత పాత్రికేయులు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *