సంక్షోభంలోకి సాగు నీటి రంగం

ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేక తెలంగాణ సాగు నీటి రంగాన్ని కాంగ్రెస్‌ సంక్షోభంలోకి నెడుతున్నదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు పోవడంలేదని, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన లేదని అన్నారు. తెలంగాణ నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సాగును బాగు చేసిన ఘనత కేసీఆర్‌దని, ప్రాజెక్టులను పడావు పెట్టి, నిర్వహణను గాలికి వదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్‌ రెడ్డిదని విమర్శించారు. ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనాలన్నారు. ఖమ్మం పెద్దవాగు కొట్టుకుపోయింది.. నల్లగొండలో సుంకిశాల కుప్ప కూలింది.. పాలమూరు వట్టెం పంప్‌ హౌజ్‌ జలమయమైంది.. నల్గొండలో ఎస్‌ఎల్‌బిసి కుప్పకూలింది.. జోగులాంబ గద్వాల్‌లో జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్స్‌ తెగిపోయాయి.. సంగారెడ్డిలో మంజీర డ్యాం ఆప్రాన్‌ వరద ధాటికి కొట్టుకుపోగా పియ్యర్స్‌లో పగుళ్లు వచ్చాయని ఆయా సంఘటనలు ఏకరువుపెట్టారు. పాలన వైఫల్యం, కాంగ్రెస్‌ చేతగాని తనం వల్లే ఇన్ని ప్రమాదాలు జరిగాయని విమర్శించారు. ఇవేవి ఎన్డీఎస్‌ఏకు కనిపించవు.. వినిపించవు.. మేడిగడ్డ కుంగిన వెంటనే ఎన్డీఎస్‌ఏకు లేఖ రాసిన కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలు ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు. మేడిగడ్డలో 85 పియ్యర్స్‌ ఉంటే అందులో ఒక పియ్యర్‌ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుప్ప కూలిందని ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి ఏడాదిన్నరలో జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యులు అని నిలదీశారు. కాళేశ్వరంపై ఏడుస్తూ కాలం వెళ్ల్లదీయడం తప్ప ఏడాదిన్నరగా మీరు చేసిందేం ఉంది రేవంత్‌ రెడ్డి అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కొత్తగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తామని చెప్పి ఆరు వేల ఎకరాలకు కూడా ఇవ్వలేదు.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాధించిన తెలంగాణలో మల్లా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి తెచ్చావు అని పేర్కొన్నారు. బనకచర్ల ద్వారా ఏపీ గోదావరి నీటిని తరలించే కుట్ర సాగుతోందన్నారు. ఏపీకి కేంద్ర నిధులు, నియామకాలు తరలివెళ్తున్నాయని తెలిపారు. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడిరదన్నారు. రేవంత్‌ రెడ్డీ.. ఇప్పటికైనా కళ్లు తెరువు.. తెలంగాణకు ప్రాణాధారం అయిన సాగునీటి రంగాన్ని నీ రాజకీయ అజెండాలకు బలి చేయకు.. మేడిగడ్డపై దుష్ప్రచారం ఆపేసి ఇకనైనా ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టు అని హరీష్‌రావు హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *