నీటి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, డిరడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు ఇప్పటికీ క్లియరెన్స్‌ రాలేదని అ లేఖలో ప్రస్తావించారు. పాలమూరుకు మైనర్‌ ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ నుంచి సేవింగ్స్‌ 45 టీఎంసీలు, గోదావరి నీటిని కృష్ణా నదికి బదిలీ చేయడం ద్వారా తెలంగాణకు రావాల్సిన 45 టీఏంసీలు ఈ ప్రాజెక్టు వినియోగించుకోవాలని ప్రతిపాదించామన్నారు. గోదావరి వాటర్‌ డిస్ప్యూట్స్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం 45 టీఎంసీల కృష్ణా నీటిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పైన వాడుకునే వీలుందని, ఆ నీటినే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించినట్లు తెలిపారు. పాలమూరు, డిరడి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉందని, ఆ తర్వాత పర్యావరణ శాఖ, సీసీ అండ్‌ ఈసీ జారీకి చేయమని సిఫార్సు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా కరువు పీడిత ప్రాంతాల రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని, ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయంతోపాటు నాబార్డ్‌ లాంటి ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు పొందే వీలుంటుందని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే 2007లోనే డిరడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ఆమోదం పొందిందని, ఫ్లోరోసిస్‌ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని ప్రధాన మంత్రి కార్యాలయం 2010 డిసెంబర్‌ 10న ప్రతిపాదించిందని గుర్తు చేశారు. 2021 సెప్టెంబర్‌ 21న కేంద్ర జలసంఘానికి సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌ (తుపాకులగూడెం బ్యారేజ్‌) డీపీఆర్‌ సమర్పించినా ఛత్తీస్‌గఢ్‌ నుంచి నో-ఆబ్జెక్షన్‌ లేనందున ఇంటర్‌-స్టేట్‌ మేటర్స్‌ డైరెక్టరేట్‌ నుంచి క్లియరెన్స్‌ ఆలస్యమవుతోందిదన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సూచనలను, నిబంధనల ప్రకారం అక్కడి భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముంపు విషయంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఇచ్చిన నివేదికలోని సిఫారసులను పాటించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోందని, శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 880 అడుగుల వద్ద 1.5 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని మళ్లిస్తోందని కేంద్ర మంత్రికి ఆ లేఖలో విన్నవించారు. ఏకంగా 841 అడుగుల నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని మళ్లించేలా ఏపీ కాల్వల నిర్మాణాలు చేపట్టిందని, 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌తోపాటు ముచ్చుమర్రి, మలయాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మించిందని, కృష్ణా నది నుంచి వరద నీటిని బేసిన్‌ వెలుపల ప్రాంతాలకు డైవర్ట్‌ చేస్తున్నదని వివరించారు. శీశైలం అట్టడుగు నుంచి నీటిని డైవర్ట్‌ చేసే నిర్మాణాలతో రిజర్వాయర్‌ ఖాళీ అవుతోందని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ మీద ఆధారపడ్డ జల విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని, రోజుకు 10 టీఎంసీల చొప్పున 20 రోజులలో 200 టీఎంసీలు డైవర్ట్‌ చేసే సామర్థ్యముండటంతో తెలంగాణలోని ఇన్‌-బేసిన్‌ అవసరాలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసీన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్‌ఎంబీ అడ్డుకోవాలి. కృష్ణా జలాల మళ్లింపుపై నియంత్రణలు విధించాలి. ఇన్‌-బేసిన్‌ అవసరాల విషయంలో కేఆర్‌ఎంబీ న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నీటి ప్రవాహాలను ఖచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ అమలు చేయాలని, టెలీమెట్రి అమలుకు తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ ఖాతాకు రూ.4.15 కోట్లు జమ చేసిందని, ఇప్పటికీ ఏపీ పరిధిలో టెలీమెట్రీ పనులు జరగలేదని, వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీకి సూచించాలి అని కోరారు. ఏపీ ప్రభుత్వంతో వస్తున్న ఇతర సమస్యలను కూడా ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి కేంద్రమంత్రికి ఆ లేఖలో సుదీర్ఘంగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *