– తీగలాగితే డొంక కదులుతోంది
– అక్రమాలపై కఠిన చర్యలు తప్పవు
– కోడ్ ఆడిట్‌కు ఆదేశాలు
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తీగ లాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించవలసిన వ్యవస్ధనే ఆనాటి ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన సంఘటనపై ఉన్నతస్ధాయి కమిటీతో విచారణ జరిపించగా దిగ్బ్రాంతి కరమైన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని, వ్యవస్ధాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని స్ఫష్టం చేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతస్ధాయి కమిటీతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాడు ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదిక ఇచ్చార, అలాగే మానవ ప్రమేయంతో తప్పులు చేసే విధంగా పోర్టల్ ను రూపొందించారని భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల సమాచారం లభించకుండా లాగిన్‌లు డిలిట్ చేశారని, అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని ఉన్నతస్ధాయి కమిటీ విచారణలో ప్రాధమికంగా గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీల సమాచారం లభించకుండా చేశారని, ఫోరెన్సిక్ ఆడిట్‌లో కోడ్ ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందని, ఈ నేపధ్యంలో తక్షణమే ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ నిర్వహణా బాధ్యతను టెర్రాసిస్ అనే విదేశీ సంస్దకు అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావలసిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని, తప్పుచేసినవారు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వానికి రావలసిన ప్రతిపైసాను వసూలు చేస్తామన్నారు. ఉన్నతస్ధాయి కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా ఏ చిన్న లోపానికి తావులేకుండా అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా భూభారతి పోర్టల్ ను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజల భూముల విషయంలో ఎటువంటి రాజీ పడబోమని, ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామని, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ , సిఎం ఆర్ వో మందా మకరంద్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్, ఉన్నత స్ధాయి కమిటీ సభ్యులు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ డిఐజి సుభాష్, ఎస్‌బి ఎస్‌పీ సింధు శర్మ, సైబర్‌క్రైమ్ డిఎస్పీ ఎ. సంపత్, హోంశాఖ సలహాదారు పి. శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





