– దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి
– ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు
టెహ్రాన్, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు చేసింది. ఈ సందర్భంగా ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి సేప్టీ నోటీస్ జారీ చేశారు. విమానాల స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచన చేశారు. అంతేగాక పలు విమానాలను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇంధన ట్యాంకుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సవిÖపంలోని ప్రజలను ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన ట్యాంకుపై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు.
యుద్ద నౌకలు పంపం : ట్రంప్ అభ్యర్థన కు ‘నో’ అన్న ఆస్ట్రేలియా
న్యూదిల్లీ : హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు యుద్ధ నౌకలను పంపాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యర్థనను మిత్ర దేశాలు తిరస్కరించాయి. ప్రస్తుతానికి తమకు ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పాయి. ట్రంప్ అభ్యర్థనను ఆస్టేల్రియా తోసి పుచ్చింది. తాము యుద్ధ నౌకలను పంపబోమని స్పష్టం చేసింది. ’ఆ జలసంధి ఎంత కీలకమో తమకు తెలుసు. కానీ అక్కడకు తాము యుద్ధ నౌకలను పంపబోము. అసలు యుద్ధ నౌకల కోసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు’ అని ఆస్టేల్రియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ చెప్పారు. ట్రంప్ అభ్యర్థనపై జపాన్ ఆచితూచి స్పందించింది. ఈ విషయంలో సంయమనం అవసరమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము మేరిటైమ్ చర్యల గురించి ఆలోచించట్లేదని పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు తెలిపింది. అమెరికాతో మరిన్ని చర్చల తరువాత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని దక్షిణ కొరియా పేర్కొంది. సమగ్ర సవిÖక్ష తరువాత ఈ విషయంలో ముందడుగు వేస్తామని వెల్లడించింది. బ్రిటన్ కూడా ఈ విషయమై ఆచితూచి స్పందించింది. యుద్ధ నౌకలను పంపించే విషయంలో ట్రంప్‌తో చర్చిస్తున్నామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కూడా చర్చించినట్టు తెలిపారు. సోమవారం జరగనున్న సమావేశంలో మరోసారి ఈ విషయమై చర్చిస్తామన్నారు. హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు యుద్ధ నౌకలను పంపించాలని పలు దేశాలను డొనాల్డ్ ట్రంప్ ఆదివారం అభ్యర్థించారు. తమ పరిధిలోని ప్రాంతాన్ని ఆయా దేశాలు రక్షించుకోవాలన్నారు. ఇంధన అవసరాల కోసం హర్ముజ్ జలసంధిపై అమెరికా అంతగా ఆధారపడలేదని, ఇతర దేశాలకే ఆ అవసరం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చైనా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా దిగుమతుల్లో అధిక శాతం హర్ముజ్ మీదుగానే వెళుతున్నాయన్నారు. అయితే, ఈ జలసంధిని తెరిపించే ప్రయత్నాల్లో చైనా భాగం అవుతుందా లేదా అనే విషయంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




