- వరుస డ్రోన్ దాడులతో ప్రజల్లో భయాందోళనలు
అబుదాబి, మార్చి 2: పర్యాటకులు, ధనవంతులు, వ్యాపారాలకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన దుబాయి నగరం ఇరాన్ ప్రతీకార దాడులతో వణికిపోయింది. శనివారం నుంచి క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు చేస్తున్న ఇరాన్.. ఆదివారం కూడా దాడి చేసింది. ఈ దాడులను సమర్ధంగా తిప్పికొట్టామని దుబాయి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రశాంతంగా ఉండే నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు, మంటలు, ఆకాశంలోకి లేస్తున్న దట్టమైన పొగ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. చాలామంది స్థానికులు, పర్యాటకులు దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉందని చెప్పారు. ముందుజాగ్రత్తగా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లన్నింటినీ కూల్చివేశామని ప్రకటించింది. అయితే జెబెల్ అలీ పోర్టు సమీపంలో ఇరాన్ ప్రయోగించిన ఓ డ్రోన్ పడి భారీగా మంటలు చెలరేగాయి. దుబాయి గగన రక్షణ వ్యవస్థ కూల్చివేసిన ఇరాన్ డ్రోన్ శకలాలు పడటంతో పామ్ హోటల్‌లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయని, వారు ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్ దాడితో దుబాయిలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్‌లకు ముప్పు ఏర్పడింది. శనివారం రాత్రి ఇరాన్ డ్రోన్ శకలాలు బుర్జ్ అల్ అరబ్ భవనాన్ని తాకటంతో అది స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఈ రెండు భవనాలను ఖాళీ చేయించారు. ఆదివారం తెల్లవారుజామున మూడు భారీ పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెప్పారు. కృత్రిమంగా సృష్టించిన విలాసవంతమైన పామ్ జుమైరా దీవిలో కూడా డ్రోన్ పడటంతో మంటలు చెలరేగాయి. కాగా, నగరంలో పరిస్థితి మామూలుగానే ఉందని దుబాయి మీడియా కార్యాలయం ప్రకటించింది. అత్యవసర వైద్య సేవల కోసం దుబాయిలో 1,200 పడకల రషీద్ ప్రభుత్వ హాస్పిటల్‌ని సిద్ధం చేసినట్లు అక్కడ సేవలందిస్తున్న ఓ భారతీయ వైద్యుడు చెప్పారు. 400మంది నర్సింగ్ సిబ్బంది, 200మందికిపైగా వైద్యులను ఉంచినట్లు తెలిపారు. నగరంలో వందలకొద్ది అంబులెన్సులను సిద్ధంగా ఉంచారన్నారు. దుబాయిలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది.. ఆదివారం మధ్యాహ్నానికి పేలుళ్లు పెరిగాయి.. అయినా పరిస్థితి అదుపులోనే ఉంది.. సామాన్య జనజీవనానికి పెద్దగా అంతరాయాలు లేవు.. ఇళ్లకే పరిమితమయ్యాం.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతున్నా ఇక్కడి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది.. యూఏఈ ఇప్పటికే ఎన్నో జాగ్రత్త చర్యలు చేపట్టింది.. అని ప్రవాసులు తెలిపారు.
కువైట్‌లో కూలిన అమెరికన్ ఫైటర్ జెట్ -తామే కూల్చామన్న ఇరాన్
కువైట్: అమెరికా సైనిక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం కువైట్ గగనతలంలో కూలిపోయింది. విమానం కూలిపోయే ముందు పైలట్ విమానం నుండి బయటకు వెళ్లాడని అంతర్జాతీయ యాడియా నివేదిస్తోంది. పైలట్ స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఇరాన్ ఒకేసారి ఇజ్రాయిల్, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించడం ద్వారా తన దాడులను కొనసాగిస్తోంది. విమానం శిథిలాలు మినా అల్ అహ్మది శుద్ధి కర్మాగారంలోకి పడ్డాయని కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీ కంపెనీ సోమవారం ధ్రువీకరించింది. ఇద్దరు కార్మికులు గాయపడ్డారని తెలిపింది. ఈ ప్రాంతంలో మోహరించిన ఎంఐఎం-104 పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయిందని అనుమానిస్తున్నారు. పేట్రియాట్ అనేది బాలిస్టిక్ క్షిపణులు, శత్రు విమానాలను కూల్చివేసేందుకు సాధారణంగా ఉపయోగించే అధునాతన వ్యవస్థ. ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా వైమానిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై కూడా క్షిపణి దాడులకు దిగింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ తదితర దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడులు చేసింది. కాగా, సోమవారం శత్రు దేశానికి చెందిన ఓ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. కువైట్ గగనతలంలో ఒక ఎఫ్-15 ఫైటైర్ జెట్‌ను తమ క్షిపణి వ్యవస్థతో కూల్చివేసినట్లు వెల్లడించింది. సంబంధిత వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఆ వీడియో ప్రకారం ఓ యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుని నెమ్మదిగా కిందకు పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విమానం అమెరికాదా లేక ఇజ్రాయెల్‌దా అనే దానిపై స్పష్టత రాలేదు. పైలట్లు ఇద్దరు పారాచూట్ల సాయంతో క్షేమంగా బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోందంటూ వస్తున్న వార్తలను ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ ఖండించారు. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్, అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు మూడో రోజుకు చేరుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు ప్రారంభించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





