పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

– 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ
– రూ.89 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి
– కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రం తెలంగాణ.. పెట్టుబడులకు స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా భవన్‌లో కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోందని తెలిపారు. రాష్ట్ర అర్థికాభివృద్ధికి, పెట్టుబడులకు వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అంశాలతోపాటు నైపుణ్యంతో కూడిన తక్కువ ధరలకే మానవ వనరులు అందుబాటులో ఉండడం కలిసివచ్చే అంశాలన్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్‌, దీనికితోడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వల్ల కనెక్టివిటీ పెరుగుతుందని, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ తరువాత రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలు అనుసంధానమవుతాయని, అవుటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వరకు 39 రేడియల్‌ రోడ్ల ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఈ రేడియల్‌ రోడ్ల మధ్య ఫార్మా, ఐటీ, హ్యాండ్లూమ్‌, ఆగ్రో వంటి పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయన్నారు. ఇక్కడి ఐటీ, ఫార్మా హబ్‌లు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందాయని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కూడా బలంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పరిశ్రలకు ప్రభుత్వం 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందిస్తోందని, అంతేకాక భవిష్యత్తులో విద్యుత్‌ కొరత లేకుండా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అందులో భాగంగా గ్రీన్‌ ఎనర్జీ దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, కృష్ణ-గోదావరి వంటి జీవనదుల మధ్యలో రాష్ట్రం ఉండడం వల్ల నీటి కొరత లేదని, గృహ వినియోగానికే కాకుండా పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు కూడా ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పూర్తి చేశామని కూడా తెలిపారు. తెలంగాణ పోలీస్‌ దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌ వ్యవస్థలలో ఒకటిగా ఉందన్నారు. ప్రత్యేకంగా సైబర్‌ క్రైమ్‌ విషయంలో దేశంలోనే పేరెన్నికగన్నదంటూ అనేక బహుమతులు గెలుచుకున్న విషయాన్ని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పట్ల పూర్తిస్థాయి నమ్మకం కలగడంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణలో సురక్షితంగా ఉంటారని ధైర్యంగా చెప్పగలనన్నారు. సుమారు 30వేల ఎకరాలలో ఫ్యూచర్‌ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది, స్కిల్‌ యూనివర్సిటీ, అంతర్జాతీయ క్రీడా మైదానాలు, ఐటీ, ఏఐ కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు అన్ని అనుమతలు లభించాయన్నారు. పారిశ్రామిక ఎగుమతుల్లో విప్లవాత్మక మార్పులకు ఈ హైవే శ్రీకారం చుట్టనుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలొనే రహదారుల అభివృద్ధికి రూ.89 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించగా పెద్ద మొత్తంలో పనులకు అనుమతులు లభించాయని, మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇప్పటికే రూ.60,799 వేల కోట్ల విలువైన పనులకు అన్ని రకాల అనుమతులు లభించాయని, మరో రూ.28 వేల కోట్ల ప్రాజెక్టులు కూడా ప్రతిపాదన దశలో ఉన్నాయి అని డిప్యూటీ సీఎం వివరించారు. మొత్తం కలిపి రెండేళ్లలొ రూ.లక్ష కోట్లను రోడ్ల నిర్మాణానికే ఖర్చు చేయబోతున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 6, 8 వరుసల రహదారులను నిర్మించబోతున్నామన్నారు. మీరందరూ తెలంగాణ అభివృద్ధి యాత్రలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి తరపున, మంత్రివర్గం తరపున తాను కోరుతున్నానన్నారు. మీ అందరి సహకారంతో తెలంగాణ రైజింగ్‌-2047 మరింత గొప్ప విజయంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎనర్జీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌, ఇండస్ట్రీస్‌-ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ట్రాన్స్‌ కో సీఎండీ కృష్ణభాస్కర్‌, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌, ఇండస్ట్రీస్‌ అండ్‌ కామర్స్‌, ఐటీఈ అండ్‌ సీ స్పెషల్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌, డెల్లాయిట్‌, ఈవై, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జెఎల్‌ఎల్‌ సహా పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *