రూ.3ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు బూట‌కం

– రెండేళ్లలో పెట్టుబడులు రూ.20వేల కోట్లు దాట‌లేదు
– జ‌ల‌య‌జ్ఞాన్ని ధ‌నయ‌జ్ఞ‌మ‌న్న‌ది రేవంతే
– జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయం
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: మందిని తొక్కడం..మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయడు ఈ ముఖ్యమంత్రి అంటూ హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఏదీ ఎక్క‌డ అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ టీఎస్ఐపాస్ లో వివరాలు ఉన్నాయి. 2024 – 25లో రూ.13,700 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయ‌న్నారు. 2025 – 26లో రూ.6,472 కోట్ల పెట్టుబడి వచ్చాయ‌న్నారు. సీఎం గంటన్నర సేపు ప్రెస్ మీట్ చూసినవారికి రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై సందేహం కలుగుతుంద‌న్నారు. ఈ ప్రభుత్వాన్ని నడపడం మాకు చేతకావడం లేదని ముఖ్యమంత్రి మాటల్లో తేలిపోయింద‌న్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని అడిగారు.ఆనాడు టీడీపీలో ఉండి వైయస్సార్ పావురాల గుట్టలో పావురం అయ్యాడు అని ఎలా అన్నావు?  కాంగ్రెస్ ప్రభుత్వ జలయజ్ఞాన్ని ధనయజ్ఞమని నువ్వే అన్నావు కదా రేవంత్ రెడ్డి అని ప్ర‌శ్నించారు. రాజశేఖర్ రెడ్డిని పట్టుకొని క్విడ్ ప్రోకో కింద లక్ష కోట్ల అవినీతి చేశాడని చెప్పింది నువ్వే కదా! కాంగ్రెస్ పాలనలో తన తండ్రి చనిపోతే దహన సంస్కారాల అనంతరం స్నానానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని చెప్పుకున్న మనిషి రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంటు రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటల కరెంటు ఇచ్చారు. 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్ మాత్ర‌మే. సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అంబేద్కర్ పేరు ఉందని సెక్రటేరియట్ కి రేవంత్ రెడ్డి పోవడం లేద‌ని ఆరోపించారు. రీయింబర్స్మెంట్ పై బహిరంగ చర్చకు స‌వాల్ విసురుతున్నాన‌న్నారు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదని ప్ర‌శ్నించారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయ‌న్నారు. పొంగులేటి  ఇంట్లో ఈడీ రైడ్స్ ఐతే ఎందుకు చెప్పలేదు?  ఈడీ ఎందుకు పొంగులేటిపై ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. బీజేపీతో రేవంత్‌కు చీకటి ఒప్పందాలు ఉన్నాయ‌ని ఆరోపించారు. కేసీఆర్  పాలనలో మొత్తం చేసిన అప్పులు రూ.2,80,000 కోట్లు అని పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 11 న బీజేపీ ఎంపీ రఘునందన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇది.  తెలంగాణ అప్పులపై అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ టాక్స్ ఆన్ రెవిన్యూ ఆవరేజ్ గ్రోత్ రేట్ 15%. సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ లో జీఎస్టీ వృద్ధిరేటులో తెలంగాణ సాధించిన వృద్ధిరేటు – 5%. దేశంలో చివరి స్థానంలో తెలంగాణ ఉంది. సెప్టెంబర్ 2024లో +1 తెలంగాణ వృద్ధిరేటు +1%.  సెప్టెంబర్ 2023లో +33 తో తెలంగాణ వృద్ధిరేటు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మ‌రిప్పుడు  రాష్ట్రం ఎందుకు వృద్ధిలో తిరోగమనం పడుతున్న‌ద‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి వసూళ్ల వల్ల, కమీషన్ల వల్ల జీఎస్టీ తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. రోడ్ టాక్స్ తగ్గింది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 2014లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రూ.62,000 కోట్లు. 2023లో రూ.2,30,000 కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కిటికీలో నుండి చూస్తే నీకు కనపడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా. రోజూ మీ ఇంటికి వెళ్లేటప్పుడుకనిపించే టీ హబ్ గాని, స్టీల్ బ్రిడ్జి గాని కేసీఆర్  కట్టింది కాదా. ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో 100 కోట్లతో రేవంత్ రెడ్డి కొత్త నివాసం నిర్మిస్తున్నాడు. కేసీఆర్ , మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాదులో ఎస్టీపీలు కట్టారు. ఈరోజు హైదరాబాదులో వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ప్రణాళిక చేసి ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి నియోజకవర్గంలో వరద బాధితులకు సహాయం అందించడానికి నన్ను పిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల బస్తీలో నీళ్లు వచ్చి ఇల్లు మునిగిపోయాయి అని చెప్పారు. నాలాల్లో పూడిక తీయకపోవడం వల్ల హైదరాబాదులో వరదలు వచ్చాయి.అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. గాలి మాటలు తప్ప ఆరు గ్యారెంటీల అమలు గురించి మాట్లాడడు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. పది రోజులు అసెంబ్లీ పెట్టు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, రైతుబంధు మీద చర్చిద్దాం అంటే ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి పారిపోయిన‌వాడు ఈ ముఖ్య‌మంత్రి అంటూ ఆరోపించారు. కామారెడ్డిలో వరద బాధితులకు ఒక రూపాయి అయినా విడుదల చేశారా?  వరదల్లో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించారా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తారా? రూ. 3,600 కోట్ల బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ రూ.8వేల కోట్ల‌కు పైగా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ బ‌కాయిలున్నాయి.  కరోనా వచ్చినా కష్టం వచ్చినా రూ.2,508 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ను కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. ఈ రెండేళ్లు రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ. పోయిన నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లకు విడుదల చేసిన బిల్లులపై శ్వేత పత్రం విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. పిల్లల చదువులు ముఖ్యమా? లేక కాంట్రాక్టర్ల కమిషన్ల ముఖ్యమా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్ మెయిల్‌ చేసి భయపెడుతున్నారు.   2023లో రెండు కోట్ల 73 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగింది.  మంత్రమేస్తే ఇంత దిగుబడి రాలేదు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, 24 గంటల కరంట్ తెచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీసి పంటను పెంచాం. కాళేశ్వరం కూలిందని అంటారు. హైదరాబాద్ కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేసామని ముఖ్యమంత్రి అంటాడు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? అని ప్ర‌శ్నించారు.  రూ. 7,000 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు గోదావరి జలాలను ఎలా తెస్తావు?  కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ, సరస్వతి పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పార్వతి పంప్ హౌస్, నంది మేడారం రిజర్వాయర్, నంది మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, రాంపూర్ పంప్ హౌస్, రాజేశ్వరంపేట పంప్ హౌస్, మల్కంపేట రిజర్వాయర్, మల్కంపేట పంప్ హౌస్, ముప్పల్ పంప్ హౌస్, అప్పర్ మానేరు పంప్ హౌస్, అనంతగిరి రిజర్వాయర్, అనంతగిరి పంప్ హౌస్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, రంగనాయక సాగర్ పంప్ హౌస్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ పంప్ హౌస్, కొండపోచమ్మ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్, వన్ పంప్ హౌస్ టు బస్వాపూర్ రిజర్వాయర్ లున్నాయి.  ఇవన్నీ కూలినయా? ఇవన్నీ కనిపించడం లేదా రేవంత్ రెడ్డి? అని ప్ర‌శ్నించారు. రిజర్వాయర్ల కింద పంటలు పండడం లేదా?  పంట పండేది నిజం. రైతుల కళ్ళల్లో ఆనందం నిజం. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌ ముందు ధర్నా చేసిన ఏకైక ప్రభుత్వం మీదే కావచ్చు. 10%, 20% కమిషన్ల కోసం పైరవీకారులు, బ్రోకర్లు సెక్రటేరియట్లో నిండిపోయారు. పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. పీజేఆర్ ను మానసికంగా వేధించి వారి చావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ కొడుకుకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. యూరియా కోసం లైన్లో నిలబడే దుస్థితి అర్థమైంది రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దింపేది అర్థమైంది. జూబ్లీహిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి ఓటేయాలని డిసైడ్ అయింది. చీరలు పంచినా, సారెలు పంచినా, పైసలు పంచిన నడువ‌వ‌న్నారు.  వెంకటేశ్వర కళ్యాణం పేరిట జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ చీరలు పంచుతున్నద‌ని ఆరోపించారు. పనివంతుడు పందిరేస్తే కుక్క తోక తాకి కూలింది అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరని ఎద్దేవా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *