– మామిడి, నారింజ పండ్ల సాగు రైతులకు భారీ ప్రోత్సాహం
` రూ.3,745 కోట్ల పెట్టుబడి, 1,518 మందికి ఉపాధి కల్పించే
` మూడు కంపెనీలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం
` ఇండస్ట్రియల్ ప్రమోషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: యువతకు ఉపాధి, వివిధ రకాల పండ్లు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం కలిగించే పద్ధతుల్లో బహుళ జాతి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వెల్లువలా కదిలి వస్తున్నాయని డిప్యూటీ సీఎం, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాల ఆసక్తి చూపుతున్న జెఎస్‌డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ మహేశ్వరంలో కొత్త యూనిట్ ప్రారంభించడానికి, తోషిబా ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, గ్యాస్ ఇన్సులేటివ్ స్విచ్ గేర్, బుషింగ్స్ పరిశ్రమ ఏర్పాటుకు, హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఈ మూడు భారీ కంపెనీల ఏర్పాటు ద్వారా రూ.3,745 కోట్ల పెట్టుబడులు, 1,518 మంది యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రుల బృందం తెలిపింది. సుమారు రూ.2,398 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కోకాకోలా బేవరేజెస్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుందని, రూ.785 కోట్ల పెట్టుబడితో వస్తున్న జెస్‌డబ్ల్యూ కంపెనీ ద్వారా 364 మందికి ఉపాధి లభిస్తుందని, రూ.562 కోట్ల పెట్టుబడితో తోషిబా కంపెనీ ద్వారా 554మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రులకు వివరించారు.
కోకాకోలా వంటి కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో మామిడి, నారింజ సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కలుగుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. దావోస్‌తోపాటు వివిధ దేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన వివిధ కంపెనీలు చేసుకున్న ఎంవోయూలు, విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





