పెట్టుబడి రూ.6 కోట్లు.. లాభం రూ.3 కోట్లు

– మహా జాతరలో మహిళా సంఘాలకు భారీ ఆదాయం
– ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి నిదర్శనం
– అభినందించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని పది మండలాలను కవర్ చేస్తూ మొత్తం 565 ఆదాయ యూనిట్లను ఎస్‌హెచ్‌జీల ద్వారా ఏర్పాటు చేయగా వారు జాతర సమయంలో రూ.3 కోట్లకుపైగా ఆదాయాన్ని సంపాదించారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ యునిట్లను ప్రారంభించి వారి వ్యాపారానికి విస్తత ప్రచారం కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్‌డ్రింక్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాల్స్, బ్యాంబూ చికెన్, క్యాంటీన్లు, స్నాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు. ఈ వ్యాపారాల కోసం రూ.6 కోట్ల పెట్టుబడిని బ్యాంకులు, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా సమకూర్చగా మొత్తం రూ.9.12 కోట్ల ఆదాయం లభించింది. పెట్టుబడి ఖర్చులు పోగా రూ.3 కోట్లకుపైగా లాభం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలవుతున్న ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి ఇది నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ప్రొత్సాహం, మహిళా సంఘాల పట్టుదల, ఆడ బిడ్డల శ్రమ ఫలితమని అభినందించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడుతూ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు దృఢమైన పునాది వేసిందని మంత్రి ప్రశంసించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *