– ఎస్‌హెచ్‌జీలు, ఎంఎస్‌ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించండి
– హ్యామ్ ద్వారా 13 వేల కి.మీ అంతర్గత రహదారులు
– ఈ రోడ్ల నిర్మాణంతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం
– 47వ ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా, 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్‌గా 2047 రోడ్ మ్యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్-2047 ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతోందని, ఇందులో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని అంటూ ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. మంగళవారం నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాషిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మొదటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో వివరించాం.. రెండో సంవత్సరం చేసిన కార్యక్రమాలు వివరించడంతోపాటు రాష్ట్రం పట్ల తమ కల ఏంటి, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నాం అనేది తెలంగాణ రైజింగ్ ఉత్సవంలో వివరించబోతున్నామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ అనేక ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ పునరుజ్జీవం వంటి అంశాలను వివరించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలో వాతావరణం, భాష, భూమి, తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బలమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి అంశాలను వివరించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థలతోపాటు స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టి జరుగుతుందన్నారు, తద్వారా జీడీపీ పెరుగుతుందని తెలిపారు. విద్యను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, డిజిటలైజ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందని భట్టి విక్రమార్క తెలిపారు. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.18%గా ఉండటం తెలంగాణ ఆర్థిక ప్రయాణంపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిజంగా మార్పు చేయాలంటే పంట కోత తర్వాతి మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సూక్ష్మ పంట నీరు, అనుబంధ రంగాల్లో బ్యాంకు రుణాలను మరింతగా పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాలు సమర్థవంతంగా అందుతున్నప్పటికీ వ్యవసాయ టర్మ్ లెండిరగ్ అవసరానికి తగ్గట్లు లేదని, ఇది రైతులు ఆధునీకరించుకోవడం, వైవిధ్యం చేర్చుకోవడం, ఆత్మనిర్భర స్థాయి నుంచి సంపన్న స్థాయికి చేరడం సహాయపడదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ లోటును బ్యాంకులు అత్యవసరంగా భర్తీ చేయాలని కోరుతున్నానన్నారు. రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, 24/7 ఉచిత విద్యుత్. వీటికి మీ భాగస్వామ్యం కలిస్తే మరింత ప్రతిఘటనశీలమైన, వాతావరణ మార్పులకు సిద్ధమైన వ్యవసాయ రంగాన్ని నిర్మించగలం అని డిప్యూటీ సీఎం విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వరి ఉత్పత్తి అద్భుతం.. కానీ ఇప్పుడు పరిమాణం నుంచి విలువ వైపు అడుగులు వేయాలి. భవిష్యత్ ఆదాయాలను భద్రపర్చే పామ్ ఆయిల్‌తోపాటు ఇతర విభిన్న పంటలకు బ్యాంకులు ఎక్కువ మద్దతు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. మహిళలు తమ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు ఎక్కువ పరిమితులు, వేగవంతమైన రిపీట్ ఫైనాన్స్ అందించాలన్నారు. ఇప్పటివరకు ఎంఎస్‌ఎంఈల కోసం ఏసీపీ లక్ష్యాలలో 50.23% సాధించినప్పటికీ వర్కింగ్ కేపిటల్ కొరతలు, రుణాల ప్రక్రియలో ఆలస్యం అనేక సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. భరోసాతో కూడిన, బలమైన ఎంఎస్‌ఎంఈ వ్యవస్థ వచ్చే దశాబ్దం తెలంగాణ రైజింగ్‌కు పునాది అని వివరించారు. 13వేల కి.మీ అంతర్గత రహదారుల నిర్మాణం, ఒక రూపాంతర కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ఇది రాష్ట్ర ఆర్థిక పటాన్ని సమూలంగా మారుస్తుంది అన్నారు. దీనిని బ్యాంకులు ప్రాధాన్యరంగ రుణ అవకాశంగా చూడాలని కోరుతున్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం మౌలిక వసతుల ఫైనాన్సింగ్‌లో పాల్గొనడం రాష్ట్ర అవసరాలకు సరిపడడం లేదు. తెలంగాణ అభివృద్ధిలో తన నేతృత్వాన్ని కొనసాగించాలంటే బ్యాంకులు మరింత బలమైన పాత్ర వహించాలని సూచించారు. డిజిటల్‌గా శక్తివంతమైన, ఆర్థికంగా భద్రత కలిగిన పౌర సమాజం సమగ్రంగా, భవిష్యత్‌కు సిద్ధమైన తెలంగాణ కోసం కీలకం అని వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్లో ఆన్ బోర్డింగ్‌ను వేగవంతం చేసి చివరి మైలు డెలివరీని బలోపేతం చేయాలని కోరుతున్నానన్నారు. గ్రామీణ పరివర్తనం, బలమైన ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు, అధిక విలువ కలిగిన తయారీ, డిజిటల్ పరిపాలన, గ్రీన్ గ్రోత్.. ఇవి తదుపరి దశకు దారితీసే రంగాలు అని డిప్యూటీ సీఎం వివరించారు. దీనికోసం బ్యాంకులు లావాదేవీ విధానం నుంచి రూపాంతరక భాగస్వామ్యం వైపు మారాలన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ఆశయానికి తగినంత ధైర్యవంతమైన క్రెడిట్ విస్తరణ, నవీన ఆర్థిక పరిష్కారాలతో మనం సిద్ధంగా ఉన్నామా అనేది ప్రధానం అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





