– తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు
– ‘ఉపాధి’ పనుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి
– పెసా చట్టం అమలుకు త్వరలో శిక్షణ
– పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: వేసవి నేపథ్యంలో వచ్చే రెండుమూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ప్రజలు నీటిని వృధా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, ఏజెన్సీల్లో పెసా చట్టం అమలు అంశాలపై బుధవారం ఆమె సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి నీటి కేటాయింపులు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు లేవని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని సింగూర్, శ్రీశైలం వంటి జలాశయాల్లో తాగునీటి నిల్వలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నీటి సరఫరా పరిస్థితిపై రోజూ నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా సోర్స్ పాయింట్లలో కొరత తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, పైప్‌లైన్ లీకేజీలు, సరఫరా లోపాలను త్వరితగతిన సరిదిద్దాలని సూచించారు. 1916 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించాలని, ప్రజల్లో ఈ సేవపై మరింత అవగాహన కల్పించాలని అన్నారు. నీటి మౌలిక వసతులపై సమగ్ర డేటాను సేకరించి, భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగపడే విధంగా రికార్డులు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. చేతి పంపులు, మోటార్లు, పైప్‌లైన్‌ల మరమ్మతులు చేపట్టడం, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీ పథకంపై మంత్రి సమీక్షిస్తూ అటవీ, దూర ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల వల్ల ఫేషియల్ రికగ్నిషన్ హాజరు నమోదు కష్టంగా మారిందన్నారు. ఈ నిబంధనలను సడలించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మూడు నెలలుగా వేతనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉపాధి కల్పనలో దేశంలో రెండో స్థానంలో ఉండటం గర్వకారణమని, రోజుకు మూడు లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పని దినాలను పెంచేందుకు రోజువారీ సమీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
పెసా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పెసా పరిధిలో ఉన్న 1,289 గ్రామ పంచాయతీలలో చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఆదివాసీ, గిరిజనుల హక్కులను రక్షించడంలో ఈ చట్టం కీలకమని, ఇసుక, అటవీ వనరుల వినియోగంపై నిర్ణయాధికారం గ్రామ సభలకే ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచాలని, జిల్లా కోఆర్డినేటర్లు, గ్రామ సభ మొబిలైజర్ల నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల అమలు లో సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రతి 15 రోజులకొకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




