పల్లెలే దేశాభివృద్ధి సూచికలు. ఒక దేశం పురోగతిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన పరిస్థితులు నిర్వచిస్తాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రం అనేక రకాలుగా ప్రగతి సాధించింది అనేది నిజం. రోడ్లు, తాగునీరు, పారిశుద్ద్యం, మౌళిక సదుపాయాల కల్పన రంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ దీనిని ముందుకు తీసుకువెళుతోంది. ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకురాబోతోంది. ప్రతి ఇల్లు ఇక ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనుంది. రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశలవారీగా ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించనుంది. ఇది వైఫై కనెక్షన్ లాంటిది. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను గ్రామీణ ప్రజలు చూడటానికి వీలుపడుతుంది. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేయనున్నారు.
తరువాత మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబ్కెర్ నెట్ కనెక్షన్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను టీ-ఫైబర్ సంస్థ తీసుకుంది. ప్రతి ఇంటికి రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ కనెక్షన్ తీసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కనెక్షన్ ఇస్తారు. ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. గ్రామంలోని అన్ని కార్యాలయాలకు, స్కూళ్లకు కూడా కనెక్షన్ ఇవ్వనున్నారు. టీవీనే కంప్యూటర్‌గా మారుతుంది కాబట్టి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశముంది. ఈ కనెక్షన్ తీసుకునేవారితో హైదరాబాద్ నుంచి సీఎం నేరుగా మాట్లాడే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రతి గ్రామంలోనూ జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఫైబర్ నెట్‌తో అనుసంధానం చేయబోతున్నారు. ఇవి ప్రతి పోలీసుస్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమవుతాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించడమే టీ ఫైబర్ లక్ష్యం. టీ ఫైబర్ నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్(టీఎన్‌వోసీ) నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాం. 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు తొలిదశలో 30 వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు చేశారు. నిజానికి, ఈ స్కీంకు సంబంధించి గత సెప్టెంబర్ నుంచే రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది హైదరాబాద్‌లో టీ – ఫైబర్ యాప్‌ను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి ఈ నెల 8న ప్రారంభించారు.
ఇందుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఐటీ, పరిశ్రమల శాఖ తెలంంగాణలో 7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆజాద్ ఇంజనీరింగ్, ప్రీమియర్ ఎనర్జీస్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్, లెన్స్ కార్ట్ సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ప్రజలకు అందించే టి-ఫైబర్ యాప్ ద్వారా టెలిఫోన్, ఇంటర్నెట్, కేబుల్ టీవీ, కంప్యూటర్ వంటి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా 3 పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి టీ ఫైబర్ యాప్, ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్స్ అందించారు. ఇందులో నుంచి వొచ్చే అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు విస్తరిస్తారు. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా మొదటి సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అందించనున్నారు. మీ సేవా ద్వారా 150 రకాల పౌర సేవలను ప్రజలకు మరింత చేరువచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో క్యూఎస్కే లను ఏర్పాటు చేయనుంది. షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్లు సమీకృత కలెక్టరేట్లు, ఇతర ప్రాంతాలు ఇంటరాక్టివ్ క్యూఎస్కే ద్వారా ప్రజల పౌర సేవలు పొందవచ్చు. దరఖాస్తు నింపడం చెల్లింపులు చేయడం సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే అవకాశాలు కల్పిస్తారు.
-ఎం.మహేందర్





