– రెండు రోజులపాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
– తరలిరానున్న దేశవిదేశాల ప్రముఖులు
– 27 ప్రత్యేక సెషన్లు.. వివిధ రంగాలపై చర్చలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల ప్రముఖులను ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.ఈ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆయా రంగాల ప్రముఖులకు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపులు పూర్తయ్యాయి. దేశవిదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా నిర్వహించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ-సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధులతోపాటు తెరి, బీసీజీ, మైక్రాన్ ఇండియా, హిటాచి ఎనర్జీ, గ్రీన్ పవర్, గ్రీన్ కో, అపోలో హాస్పిటల్స్, ఐఐటీ హైదరాబాద్, నాస్కావమ్, సఫ్రాన్, డీఆర్‌డీవో, స్కైరూట్, ధ్రువ స్పేస్, అమూల్, లారస్ ల్యాబ్స్,జీఎంఆర్, టాటా రియాల్టీ, కోటక్ బ్యాంకు, గోల్డ్‌మన్ సాచ్స్, బ్లాక్ స్టోన్, డెలాయిట్, క్యాపిటా ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్ల్యూఎస్, రెడ్ హెల్త్, పీవీఆర్ ఐనాక్స్, సిఖ్‌యా ఎంటర్‌టైన్‌మెంట్, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పాల్గొంటారు. రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు ‘క్రియేటివ్ సెంచరీ- సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ చర్చలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతోపాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్‌లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ సదస్సు ఏర్పాట్లను నిరంతరం స్వయంగా సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సదస్సు వేదికలో రెండో రోజున అంటే 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్‌ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. అన్ని రంగాల్లో భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను పొందుపరిచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




