– బౌద్ధ వారసత్వ పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి ప్రోత్సాహానికి..
– విశ్వశాంతికి బౌద్ధమే మార్గం: మంత్రి జూపల్లి కృష్ణారావు
– అట్టహాసంగా అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: విద్వేషాలు, విభేదాలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచాన్ని గౌతమ బుద్ధుని కరుణ, అహింసలే కాపాడగలవని, ఆయన బోధనలు సమకాలీన సమస్యలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సు-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌద్ధ వారసత్వ పరిరక్షణ, ప్రపంచ శాంతి స్థాపనలో, అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడిలో మంత్రి చొరవను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ఇంటర్‌ఛేంజ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆయనకు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రైజ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు వరల్డ్ పీస్ అవార్డును ప్రదానం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు మున్ యోంగ్ జో ఈ పురస్కారాన్ని అందజేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఆసరగా నిలుస్తూ మానవ విలువల కోసం కృషి చేస్తున్న మంత్రి సేవలను కొనియాడారు. అవార్డును స్వీకరించిన మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న శాంతి, సహనం, అహింస విలువలకు లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డ వేల ఏళ్లుగా బౌద్ధ వైభవానికి నిలయమని గుర్తుచేశారు. కృష్ణా నదీ తీరాన ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని, శూన్యతా సిద్ధాంతాన్ని ప్రవచించి ఈ ప్రాంతాన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి చారిత్రక ప్రదేశాలు పురావస్తు కేంద్రాలు మాత్రమే కావని, అవి మన మహోజ్వల నాగరికతకు సజీవ సాక్ష్యాలని అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక చిత్రపటంలో అగ్రగామిగా నిలబెడతామని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ వద్ద 274 ఎకరాల్లో నిర్మించిన తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ నాగార్జునసాగర్ ప్రాంతంతో ఆచార్య నాగార్జునకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూలికట్ట, కోటిలింగాల వంటి చారిత్రక క్షేత్రాల సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమగ్ర బౌద్ధ పర్యాటక వలయాన్ని రూపుదిద్దుతూ యాత్రికులకు ప్రపంచస్థాయి అనుభవం కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రాజెక్టు నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ శాంతి దిశగా కొత్త పుంతలు తొక్కుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీలంక బౌద్ధ శాసన మంత్రి ప్రొఫెసర్ హినిదుమ సునీల్ సేనెవి, వియత్నాం ప్రతినిధి డాక్టర్ తిచ్ నాత్ తు, బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, సదస్సు కో ఆర్డినేటర్ శివనాగి రెడ్డి, 22 దేశాల నుంచి వచ్చిన 150మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





