ఎస్‌హెచ్‌జీలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు

– 3.50 లక్షల మందికి రేపు పంపిణీ

– రుణాల మొత్తం మహిళల బ్యాంకు ఖాతాలో జమ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు 3.50 లక్షలమందికి రూ.300.40 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం పంపిణీ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ పురోగతి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడవ విడత వడ్డీ లేని రుణాలను 25వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న ఈ రుణాలతో మహిళల్లో ఒక ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం ఏర్పడిరదన్నారు. ఈ రుణాల మొత్తం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నందున ఎవరెవరికి ఎంత మొత్తం అందిందో సభ్యులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా సాగుతోందని, వాటి నాణ్యత, డిజైన్ల పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ తమకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందించడం పట్ల రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నాణ్యమైన చీరలను అందించడంతో పాటు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను కూడా అందించడం పట్ల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ జిల్లాల్లో వేగవంతంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడంపట్ల జిల్లా కలెక్టర్లను అభినందించారు. త్వరితగతిన ఈ చీరలను పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా నుండి ప్రాతినిధ్య వహించే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ప్రీ-మెట్రిక్‌ స్కాలర్షిప్స్‌ నిధులు విడుదల చేశామని, వీటిని సమర్థవంతంగా పంపిణీ చేయడానికి జిల్లాల్లో వెల్ఫేర్‌ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జ్యోతి బుద్ధా ప్రకాష్‌, హౌసింగ్‌ ఎండీ గౌతమ్‌, సెర్ప్‌ సీఈవో దివ్య, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సృజనలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *