12 నుంచి ఉత్సవంలా వడ్డీ లేని రుణాలు

మహిళా సాధికారతలో తెలంగాణ రోల్‌ మోడల్‌
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మహిళా సాధికారతలో తెలంగాణ ఒక రోల్‌ మోడల్‌గా నిలవాలని, దేశం అంతా రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను శనివారం ప్రజాభవన్‌లో అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను మహారాణులుగా గౌరవించుకోవాలని రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని యావత్‌ కేబినెట్‌ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతోందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ నేతలు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలను గాలికి వదిలేసారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాలను తిరిగి ప్రారంభించి మహిళా సంఘాలను ప్రోత్సహించి వారితో ప్రత్యేకంగా వ్యాపారాలు చేయిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున లక్షలాదిమందితో సభ నిర్వహించి ఇప్పటికే రెండుసార్లు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. మరోసారి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాల ద్వారా లభించిన పెట్టుబడులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏయే వ్యాపారాలు చేయాలి అనే అంశంపై ఈనెల 7 నుంచి 9 వరకు జిల్లా, మండల, గ్రామ శాఖ స్థాయిలో మహిళా సంఘాలు సమావేశమై చర్చించుకోవాలని, ఈ రుణాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం వారికి సూచించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించాం,. మొదటి దశలో రూ.కోటి అద్దెను ఈరోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేయడం ఒక గొప్ప శుభ పరిణామం అని భట్టివిక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున రాబడులు మహిళా సంఘాలకు అందుతాయని, త్వరలోనే వాటిని ప్రకటిస్తామని తెలిపారు. విద్యుత్‌ శాఖ మహిళా సంఘాలతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్లకు తగ్గకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి దగ్గర క్యాంటీన్లు, పాఠశాలల మరమ్మతులు, విద్యార్థుల స్కూల్‌ డ్రెస్సులు కుట్టడం వంటి పనులను మహిళా సంఘాలకు ఇచ్చి వారిని ఆర్థికంగా ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారని, అందులో భాగంగా మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించామని,, ప్రతి ఏటా రూ.20 వేల కోట్లకు తగ్గకుండా ఈ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరి సమక్షంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు భట్టి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *