“ఇంటర్మీడియట్ విద్య విద్యార్థి జీవితంలో అత్యంత కీలక దశ. ఈ దశలోనే వారు తమ లక్ష్యాలను నిర్ణయించుకుని ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఈ స్థాయిని కేవలం తరగతి దశగా కాకుండా, భవిష్యత్తును నిర్మించే బలమైన పునాదిగా భావించాలి. అందుకే నాణ్యమైన బోధన, సరైన మార్గదర్శకం, సమగ్ర వాతావరణం అత్యవసరం.”

ప్రిన్సిపల్ ,
న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్,
వై.యం.సి.ఏ.
“విద్యపై పెట్టే వ్యయాన్ని భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా చూడాలి” అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నినాదం, విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ దృక్పథంతోనే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి దిశగా పలు సంస్కరణలు అమలు అవుతున్నాయి.ఇంటర్మీడియట్ విద్య విద్యార్థి జీవితంలో అత్యంత కీలక దశ. ఈ దశలోనే వారు తమ లక్ష్యాలను నిర్ణయించుకుని ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఈ స్థాయిని కేవలం తరగతి దశగా కాకుండా, భవిష్యత్తును నిర్మించే బలమైన పునాదిగా భావించాలి. అందుకే నాణ్యమైన బోధన, సరైన మార్గదర్శకం, సమగ్ర వాతావరణం అత్యవసరం.
ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం అందడం వల్ల శారీరక, మానసిక అభివృద్ధి మెరుగుపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేస్తోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ దేశంలోని అన్ని విద్య బోర్డులకు ఆదర్శంగా నిలిచింది. దీనికి రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కళాశాలల సీసీ కెమెరాలను అనుసంధానం చేయడం ద్వారా బోధన, పరీక్షలు, పరిపాలన వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారాయి.
రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ సదుపాయాల విస్తరణతో ఆధునిక విద్య అందుబాటులోకి వచ్చింది. IFP, IDP ప్యానెల్స్ మరియు ఉచిత వై-ఫై ద్వారా విద్యార్థులు NEET, JEE, EAPCET, CLAT వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధమవుతున్నారు. విద్యార్థులు మరియు కళాశాల సిబ్బందికి సంబంధించి హాజరు శాతం పెంచేందుకు FRS (Face Recognition System) విధానాన్ని అమలు చేయడం ద్వారా కళాశాల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతున్నాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి CFM నిధులు విడుదల చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 56 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడం విశేషం. అలాగే క్రీడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందించడం ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. డ్రగ్-ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో “ప్రహరి క్లబ్‌లు” ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంచుతున్నారు. లెక్చరర్లకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారు విద్యార్థులకు మార్గదర్శకులుగా మారుతున్నారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి కళాశాలలో స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించడం, “టెలి-మానస్” వంటి కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయం. ఇది పరీక్షల భయాన్ని తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే ప్రభుత్వ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లకు కేంద్రీకృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బోధనా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయి. 14 ఏళ్ల తర్వాత ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా పాఠ్యపుస్తకాలను సవరించడం విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిద్ధమవడం సులభం అవుతుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల ఖాళీలను వేగంగా భర్తీ చేయడం ద్వారా బోధనలో నిరంతరత ఏర్పడింది. ప్రభుత్వ కళాశాలలో ల్యాబ్ సామాగ్రి కొరత లేకుండా చేయడం ద్వారా ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ఒకేషనల్ విద్యలో సంప్రదాయ కోర్సులతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు ఉపాధికి తగిన నైపుణ్యాలను సాధిస్తున్నారు.
మొత్తంగా ఈ సంస్కరణలు ఇంటర్మీడియట్ విద్యను నాణ్యత వైపు నడిపిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు విద్యావ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చి, విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు దారి చూపిస్తున్నాయి.




