ప్రభుత్వంపై భారం లేకుండా సమీకృత భవనాలు

– రిజిస్ట్రేషన్‌ శాఖలో కీలక సంస్కరణలు అమలు
– పేదల, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు
– అక్రమార్కుల భరతం పడతాం – కబ్జాలపై ఉక్కుపాదం
– రెవన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనలకనుగుణంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలో ఎస్‌ఎస్‌ఆర్‌ బిల్డర్స్‌ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యం, పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్‌ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్‌తోనే ఈ 12 సమీకృత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనాలను నిర్మించే సంస్ధలే కనీసం ఐదేళ్లపాటు వాటిని నిర్వహించాలన్న నిబంధన కూడా పొందుపరిచామని తెలిపారు. మొదటి దశలో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ ల్యాండ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (తాలిమ్‌) భవనంలో సమీకృత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనం జరిగిందని, జూన్‌ నాటికి ఈ భవనాన్ని ప్రారంబిస్తామని వెల్లడిరచారు. కొత్తగా పెళ్లి అయి రిజిస్ట్రేషన్‌కు వచ్చే జంటలు, చిన్న పిలతో వచ్చే తల్లులు, పేదలకు సకల సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖను ఆదాయ వనరుగా కాకుండా సేవా కేంద్రంగా చూస్తోందని స్పష్టం చేశారు.

పేదవారిని దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు

రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేకూర్చాలనే ఆలోచన కాకుండా పేద‌వారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్క‌ర‌ణ‌లు తెచ్చామ‌ని మంత్రి తెలిపారు. పేదలకు గతంలో ఇచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని, అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని వెల్లడిరచారు. ప్రతిపక్షాలతో విమర్శ చేయించుకునే పరిస్ధితి రాకుండా పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తుందని స్ఫష్టం చేశారు. ఒకప్పుడు పేదలకు పంపిణీ చేసిన భూములను, అసైన్డ్‌ భూములను ఒకవేళ ప్రభుత్వం తీసుకోవాలనుకున్నా వారికి తగిన పరిహారం, ప్రత్యామ్నాయ స్ధలం మంజూరు వంటి చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ రావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐ.జీ రాజీవ్‌ గాంధీ హనుమంత్‌, ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్న డీఎస్‌ఆర్‌ నిర్మాణ సంస్ధ అధినేత సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *