2నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి

– సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఒకే గొడుగు కిందకు
– ఒకే క్లిక్‌తో సమస్త భూ సమాచారం
– ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్ నెంబర్
– రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి\

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ చిక్కుముడులను విప్పుతూ రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలందించడమే లక్ష్యంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజిమెంట్ సిస్టమ్)ను ఏప్రిల్ 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎనఐసి అధికారులతో మంత్రి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలÅ£నుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ది చేసినట్లు తెలిపారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా ఈ పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఈ భూభారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్‌లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులుచేర్పులు చేసి రెండవ దశలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘ధరణి’ని బంగాళాఖాతంలో కలిపి భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామన్నారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయవిక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి సర్వే నెంబరుకు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షా లేని ఐదు గ్రామాల్లో రీ సర్వే నిర్వహించి భూధార్ నెంబర్‌ను కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా కోణంలోనే ఉంటుందన్నారు. ఒక క్లిక్‌తో రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా చాలా సులువుగా, సులభతరంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను రూపొందించామని, ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావలసిన సమాచారం లభిస్తుం<ని వివరించారు. ఈ పోర్టల్‌లో ప్రధానంగా సమాచారం సేవలు, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ సేవలతోపాటు సిటిజన్ డాష్ బోర్డు సేవలకు సంబంధించి మైల్యాండ్ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు, ఫీడ్‌బ్యాక్, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్, భూధార్ నెంబర్, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, ఈసీ, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్, ఆర్వోఆర్, గ్రామాల నక్షా, పాస్ బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం, సేవలు లభించేలా మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ పూర్తిస్దాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రతి స్టేజ్‌లో దాని వివరాలను తెలియజేస్తూ ఎసఎమఎస్ ద్వారా ఖాతాదారునికి సమాచారం కూడా అందుతుందన్నారు. ధరణి పోర్టల్‌లో 36 మాడ్యూల్స్ ఉండగా భూభారతి పోర్టల్‌లో ఒకే ఛాప్టర్ కింద తీసుకొచ్చామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎనఐసి అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *