– మహిళా సంఘాలకు రూ.246 కోట్ల చెల్లింపు
– బీమా భరోసాతో ధైర్యంగా వ్యాపార విస్తరణ
– మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహిళల కుటుంబాలకు భరోసా కల్పించడం, వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎస్‌హెచ్‌జీలోని మహిళలు ఎవరైనా అనుకోని సందర్భంలో మరణిస్తే వారు తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడేవని మంత్రి గుర్తు చేశారు. కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే గ్రూపులోని ఇతర సభ్యులే ఆ రుణ భారం మోయాల్సి వచ్చేదని, సభ్యురాలు బ్యాంకు రుణం చెల్లించకపోతే ఆ భారం ఇతర సభ్యులపై పడి వారు కూడా చెల్లించలేని పక్షంలో బ్యాంకులు ఆయా సంఘాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేవని వివరించారు. దీని వల్ల కొత్త రుణాలు మంజూరు కాక చాలా సంఘాలు అచేతనంగా మారాయన్నారు. ఈ అవస్థలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణ బీమాను వర్తింపజేయాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇందులో భాగంగా మహిళలకు జీవిత బీమాతోపాటు వారు పొందిన రుణాలపైనా బీమా వర్తింపజేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకు రుణం తీసుకున్న మహిళ మరణిస్తే ఆమెరుణాన్ని ప్రభుత్వమే చెల్లించేలా వ్యవస్థను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాద బీమా పథకం కింద ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ప్రమాద మరణం సంభవిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీమా పథకం అమల్లోకి వచ్చిన 2024 నుంచి ఇప్పటివరకు 231 క్లెయిమ్స్ పరిష్కరించి రూ.23.1 కోట్లు లబ్ధిదారుల కుటుంబాలకు అందించినట్టు మంత్రి చెప్పారు. అనుకోని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా ఈ పథకం పెద్ద ఊరటనిస్తోందన్నారు. లోన్ బీమా ద్వారా ఎస్‌హెచ్‌జీ సభ్యులు బ్యాంకుల్లో తీసుకున్న బకాయి రుణాలకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా కవరేజీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,993 క్లెయిమ్స్‌ను పరిష్కరించి రూ.223.7 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. లోన్, ప్రమాద బీమా అమలులోకి వచ్చిన తర్వాత అనేక మహిళా సంఘాలు మళ్లీ క్రీయాశీలకంగా మారినట్లు మంత్రి తెలిపారు. కొత్త సభ్యులు సంఘాలలో చేరుతున్నారని, బీమా భరోసాతో మహిళలు ధైర్యంగా వ్యాపారాలు విస్తరించుకుంటున్నారని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



