– ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే ప్రాధాన్యం
– విద్యుత్ ఉద్యోగ కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం చరిత్రాత్మకమని, ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రిమండలి ఉద్యోగుల క్షేమం కోసం ఆలోచన చేసి కేబినెట్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు అసెంబ్లీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క రూ.కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందని, యజమానిపై ఆధారపడిన జీవితాలు తారుమారవుతున్న తీరును తాము గమనించామని తెలిపారు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇలాంటి నిస్సహాయ స్థితి రాకూడదన్న మానవీయ ఆలోచనతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.1.20 కోట్ల భారీ ప్రమాద బీమాను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ప్రకటించారు. ప్రమాద బీమా పథకం ద్వారా విద్యుత్ సంస్థల్లోని 51 వేల మందికిపైగా, సింగరేణి సంస్థలోని 41 వేల మంది, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 7.57 లక్షల మంది కుటుంబాల్లో ఈ పథకం భరోసాను కల్పిస్తుందని వివరించారు. ప్రజా ప్రభుత్వం రాగానే విద్యుత్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో సంస్థల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించామని భట్టి గుర్తు చేశారు. ఈ క్రమంలోనే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తూ 2025 అక్టోబర్ 10న మరణించిన వరుస సురేష్, మహబూబ్‌నగర్ సర్కిల్ సివిల్ విభాగంలో ఆర్టిజన్‌గా పనిచేస్తూ 2025 ఏప్రిల్ 19న మరణించిన ముక్తార్ బేగ్ కుటుంబాలకు రూ.1.20 కోట్ల చొప్పున బీమా చెక్కులను అందజేసి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీరి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదనతోపాటు వారు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు వర్ణనాతీతమని, ఆ అభద్రతాభావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకూ ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యం కాని రీతిలో ఒక మహత్తర జీవిత బీమా పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టామన్నారు. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, ఆజారుద్దీన్, ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




