మాతాశిశువులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేయనున్న కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: తన జన్మదినం సందర్భంగా ఈ నెల 24న సిరిసిల్ల జిల్లాలోని బాలింతలు, శిశువులకు కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టనున్నారు. ఈసారి వినూత్నంగా 18 నెలలుగా జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు, వారి తల్లులకు కేసీఆర్ కిట్ అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తన జన్మదినం సందర్భంగా గత అయిదేళ్లుగా చేపడుతున్న గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈసారి తన జన్మదినం సందర్భంగా సంవత్సర కాలంగా తన నియోజకవర్గంలో జన్మించిన 4,910 మంది శిశువులతోపాటు వారి తల్లులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని, అందులో తనకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం కేసీఆర్ కిట్ అని ఆయన అన్నారు. మాతాశిశు మరణాలను భారీగా తగ్గించి, తల్లికి, శిశువుకు మంచి ఆరోగ్యాన్ని అందించే కేసీఆర్ కిట్‌ను ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు. అందుకే సిరిసిల్ల జిల్లాలో గత 18 నెలలుగా పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు కేసీఆర్ కిట్‌ను అందిస్తానని కేటీఆర్ తెలిపారు. 2020 సంవత్సరంలో కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సందర్భంలో తన అనుచరులు, కార్యకర్తలు గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా 108 అంబులెన్స్ వాహనాలను ప్రభుత్వ హాస్పిటల్స్‌కు అందించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 2021లో 14మంది దివ్యాంగులకు సహాయం అందించారని చెప్పారు. 2022లో సుమారు 600 సామ్‌సంగ్ మొబైల్ టాబ్స్‌ను సిరిసిల్ల జిల్లాలోని విద్యార్థులకు అందించామని, వీటి ద్వారా విద్యార్థులు నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారని, అనేకమంది ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు ఇది దోహదపడిరదని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. 2023లో ప్రతిభాపాఠవాలు కలిగిన 116మంది స్టేట్ హోం (యూసుఫ్‌గూడ) విద్యార్థులకు లాప్‌టాప్‌లు అందించి అవసరమైన శిక్షణకు వారికి మద్దతు అందించినట్లు తెలిపారు. అదే సంవత్సరం సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు సహకారం అందించినట్టు చెప్పారు.




