– పునర్విభజన చట్టాలను అమలు చేయలేదు
– కాంగ్రెస్ వచ్చాకే సంక్షేమ కార్యక్రమాల అమలు
– కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం
నిజామాబాద్, ప్రజాతంత్ర, పిబ్రవరి 7: రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కుడా 13 ఏండ్ల బిజెపి పాలకులు అమలు పరచలేక పోయారని ఆయన మండిపడ్డారు. నిధుల కేటాయింపుల్లో బిజెపి పాలకుల మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదన్నారు. పురపాలక సంఘం ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ లోకసభ నియోజకవర్గానికి ఇంచార్జీ గా వ్యహారిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు కోరుట్ల,మెటపల్లి,భీంగల్,ఆర్ముర్ పురపాలక సంఘాల పరిధిలో ఆయన విస్తృతంగా పర్యటించి ఆయా పురపాలక సంఘాల పరిధిలో జరిగిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. ఆయా పురపాలక సంఘాల పరిధిలో జరిగిన బహిరంగ సభలలో ఎస్.సి,ఎస్.టి,మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మినరల్ డేవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్,డిసిసి అధ్యక్షుడు నందయ్యకోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ జువ్వాది నర్సింగ్ రావు,బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జీ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా కోరుట్ల పురపాలక సంఘం పరిధిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం అందించాల్సిన నిధులు మంజూరు చేయక పోవడంతోటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల కాలంలో పురపాలక సంఘం పరిధిలో జరగాల్సిన అభివృద్ధి జరగ లేదని దుయ్యబట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా జరుగుతున్న అభివృద్ధి అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ తెలంగాణా ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నీరాజనాలు పలుకుటుందన్నారు. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని ప్రస్తుత పురపాలక సంఘం ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ వైపు అనుకూల పవనాలు వీస్తున్నాయని అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజామోదం లభించిందని చెప్పడానికి సంకేతమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మధ్యతరగతి పేద ప్రజలకు 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణా రాష్ట్ర జనాభాలోని 85% జనాభాకు నాణ్యమైన సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం,అర్హులైన నిరుపేదలందరికి కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చెయ్యడం వంటి సంక్షేమ పథకాలతో రేపు జరగ బోయో పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్న నేపథ్యంలో బి.ఆర్.ఎస్,బి.జే. పి లకు వేసే ప్రతీ ఓటు నిరుపయోగంగా మారుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 పురపాలక సంఘాలతోపాటు నిజామాబాద్ సహా 6 కార్పొరేషన్ లో కార్పొరేషన్ లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలలోనూ ఇవే ఫలితాలు ప్రస్ఫుటం అవుతున్నా యని ఆయన వివరించారు. ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి వెన్నుదన్నుగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి కోరుట్ల నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ జువ్వాది నర్సింగ్ రావు వరకు కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షానే నిలుస్తుందని కోరుట్ల పురపాలక సంఘం పరిధిలో జరిగిన సభలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మైనారిటీలను ఉద్దేశించి ఉర్దూలో చేసిన ప్రసంగానికి అనూహ్య స్పందన లభించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.